వరంగల్‌‌‌‌ అయాన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ అకాడమీ స్టూడెంట్‌‌‌‌ అదృశ్యం

వరంగల్‌‌‌‌ అయాన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ అకాడమీ స్టూడెంట్‌‌‌‌ అదృశ్యం
  • చైర్మన్‌‌‌‌ లైంగికంగా వేధించడంతో క్యాంపస్‌‌‌‌ నుంచి వెళ్లిపోయిన మహిళ
  • సారీ చెప్పాలని అడగడంతో మహిళతో పాటు ఆమె తండ్రిపై దాడి
  • అవమానం తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు సోషల్‌‌‌‌ మీడియాలో ప్రచారం
  • పరార్‌‌‌‌ అయిన అకాడమీ చైర్మన్‌‌‌‌ అన్వర్‌‌‌‌, అభ్యర్థుల ఆందోళన

వరంగల్/ఖిలా వరంగల్‌‌‌‌ (కరీమాబాద్), వెలుగు : పోలీస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌‌‌‌ వేధింపులు, తనతో పాటు తన తండ్రిపై దాడి చేయడంతో మనస్తాపానికి గురైన అకాడమీ స్టూడెంట్‌‌‌‌, ఉద్యోగి రెండు రోజులుగా అదృశ్యమైంది. అయితే సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన సోమవారం వరంగల్‌‌‌‌లో వెలుగు చూసింది. అకాడమీ స్టూడెంట్లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌‌‌‌ నగరానికి చెందిన అన్వర్‌‌‌‌ అనే వ్యక్తి గతంలో ఆర్‌‌‌‌ఎస్సైగా పనిచేశాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి బొల్లికుంట శివారులో అయాన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ అకాడమీని నిర్వహిస్తున్నాడు. విజయవాడకు చెందిన షామిలీ అనే మహిళ అయాన్‌‌‌‌ అకాడమీలో కోచింగ్‌‌‌‌ తీసుకుంటూ అక్కడే అకౌంటెంట్‌‌‌‌గా పనిచేస్తోంది. అన్వర్‌‌‌‌ షామిలీని లైంగికంగా వేధించడంతో భరించలేక ఇటీవల అకాడమీ నుంచి వెళ్లిపోయింది. అన్వర్‌‌‌‌ మాత్రం షామిలీపై చెడుగా ప్రచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఈ నెల 26న తన తండ్రితో కలిసి అకాడమీకి వచ్చింది. తనను వేధించడమే కాకుండా, చెడుగా ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అన్వర్‌‌‌‌ షామిలీతో పాటు ఆమె తండ్రిని అసభ్యకరంగా తిడుతూ చెప్పులతో దాడి చేసి కాళ్లతో తన్నుతూ ఇష్టారీతిన కొట్టాడు. క్యాంపస్‌‌‌‌లో ఉన్న స్టూడెంట్లు చూస్తున్నా వదలలేదు. అనంతరం షామిలీతో పాటు ఆమె తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

నాగార్జునసాగర్‌‌‌‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం

అన్వర్‌‌‌‌ దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయిన షామిలీ తన భర్త సొంత జిల్లా నల్గొండలోని నాగార్జునసాగర్‌‌‌‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం సోషల్‌‌‌‌ మీడియాతో పాటు స్టూడెంట్ల గ్రూప్‌‌‌‌లోనూ ‘రిప్‌‌‌‌ షామిలీ’ అంటూ పోస్టింగ్‌‌‌‌లు కనిపించాయి. వీటిని చూసిన అన్వర్‌‌‌‌ తన ఆఫీస్‌‌‌‌కు, తరగతి గదులకు తాళాలు వేసి పరార్‌‌‌‌ అయ్యాడు. ఘటనను నిరసిస్తూ అకాడమీ స్టూడెంట్లు సోమవారం ఉదయం ఇన్స్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన సుమారు 320 మంది అకాడమీలో ఉన్నారని, కోచింగ్‌‌‌‌ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ. రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు వసూలు చేసినట్లు చెప్పారు. షామిలీతో పాటు ఆమె తండ్రిపై అన్వర్‌‌‌‌ దాడి చేశాడని, ఈ విషయాన్ని బయట చెప్పొద్దని బెదిరించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెప్పారు.