వరంగల్ జిల్లాలో చీటీలు కట్టినోళ్ల తిప్పలు తిప్పలు కాదుగా..!

వరంగల్ జిల్లాలో చీటీలు కట్టినోళ్ల తిప్పలు తిప్పలు కాదుగా..!
  • చీటీల డబ్బుల కోసం ధర్నాలు, దీక్షలు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సపోర్ట్తో ఎదిగిన చిట్​ఫండ్​ సంస్థలు 
  • ఉమ్మడి వరంగల్  కేంద్రంగానే సుమారు 300 కంపెనీలు
  • డబ్బులివ్వకుండా సతాయింపు..బరితెగింపు  

వరంగల్, వెలుగు: తాము వేసిన చీటీ పూర్తయినా డబ్బులు ఇవ్వట్లేదంటూ  వరంగల్​లో బాధితులు ధర్నాలు, డప్పు కొట్టి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా స్పందన లేకపోతే..  చిట్​ ఫండ్​ కంపెనీ వద్ద .. లేదంటే  యజమాని ఇంటి ఎదుట  వారాల తరబడి నిరహర దీక్షలు చేస్తున్నారు. బోర్డ్ తిప్పుతున్న పలు  కంపెనీలకు నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదో ఒక రూపంలో సహకరించారు.

చిట్​ఫండ్​ కమ్ రియల్ దందా ..

రాష్ట్రంలో ఓరుగల్లు కేంద్రంగా చిట్ ఫండ్ సంస్థలు   బిజినెస్ చేస్తున్నాయి.  వరంగల్​ మెయిన్ ఆఫీస్ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచులను ఓపెన్  చేశారు. బంధువులను పార్ట్​నర్లు, మేనేజర్లుగా పెట్టి.. ఏజెంట్లతో రూ. వందల కోట్ల  చిట్స్, డిపాజిట్ల రూపంలో సేకరించారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ  జిల్లాల్లో దందా నడిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అండతో దందా

బీఆర్ఎస్ ప్రభుత్వం లో  పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ ఎమ్మెల్యేల బంధువులు, అనుచరులు ఓ వైపు చిట్​ఫండ్​ , మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అడుగుపెట్టారు. మరికొన్నిచోట్ల తెరవెనుక సాయం అందించారు. వరంగల్​లో  ప్రస్తుతం వివాదస్పదమవుతున్న పలు చిట్​ ఫండ్​ కంపెనీల్లో నాటి బీఆర్ఎస్ నేతలు వివిధ హోదాల్లో ఉండగా.. ఇతర సంస్థలకు స్లీపింగ్ పార్ట్​నర్లుగా  ఉన్నారు. ప్రస్తుతం దివాలా తీస్తున్నాయని చెబుతున్న పలు   కంపెనీల ప్రారంభోత్సవంలో నాటి గులాబీ   ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో నేతలపై నమ్మకంతో జనాలు ఆయా   సంస్థల్లో చేరారు.  

నేడు కస్టమర్లను తిప్పుకుంటున్న  కంపెనీలకు నాటి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండగా.. గ్రేటర్ మేయర్, మరో కార్పొరేషన్ చైర్మన్ ఏకంగా చిట్​ ఫండ్​ సంస్థకు బాధ్యులుగా ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిట్​ ఫండ్​  కంపెనీలు  కస్టమర్లను బెదిరించడం మొదలు..  మర్డర్ చేసేవరకు వెళ్లాయి.  ఈ మోసాలపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో నాటి పోలీస్ కమిషనర్లు తరుణ్​ జోషి, ఏవీ.రంగనాథ్ బాధితులతో ప్రజాదర్బార్ నిర్వహించారు.  రూల్స్​కు  విరుద్ధంగా జనాల సొమ్ముతో  బిజినెస్​లు  చేస్తున్న  కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.  బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేశారు.

వరుస  ధర్నాలు, ఆందోళనలు..

గ్రేటర్ వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్​ రావు  చైర్మన్​ గా వ్యవహరిస్తున్న భవితశ్రీ చిట్​ఫండ్​ ఓనర్ల ఇండ్లముందు బాధితులు ఫ్లెక్సీలు కట్టుకుని రెండు వారాలుగా నిరసన దీక్షలకు దిగారు. జనవరి 28న  కమలాపూర్ మండలం కానిపర్తికి చెందిన లారీ డ్రైవర్ ధర్ముల ప్రతాప్ తన రూ.5 లక్షల డిపాజిట్ డబ్బుల కోసం కేయూ రోడ్డులోని కనకదుర్గ చిట్స్ మెయిన్ ఆఫీస్​లో  రాత్రంతా అక్కడే ఆందోళన చేశాడు.  

సిబ్బంది అతనిని గదిలోనే  బంధించారు. బాధితుడు తన బంధువులకు ఫోన్ చేయడంతో విషయం బయటకొచ్చింది. నక్కలగుట్టలోని అక్షర చిట్​ఫండ్​  మెయిన్ ఆఫీస్ ముందు రెండ్రోజులకోసారి ఆందోళనలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో గురువారం దాదాపు 50 మంది బాధితులు ఏకంగా  కంపెనీ ఎదుట  డప్పులు వాయించి ఆందోళనకు దిగారు.  . దాదాపు రెండు, మూడు గంటల గొడవ తర్వాత పోలీసులు వచ్చి  బాధితులకు సర్ధిచెప్పారు.