వరదలో వరంగల్.. సిటీలో 30 కాలనీలు జలదిగ్బంధం

  • ఇండ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు 
  • సాయం కోసం బిల్డింగుల పైకెక్కిన జనం
  • బోట్లు, ట్రాక్టర్ల ద్వారా షెల్టర్​కు తరలింపు

వరంగల్/హనుమకొండ, వెలుగు: వరంగల్‍ సిటీ వరద గుప్పిట చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఒక్కసారిగా కాలనీల్లోకి చేరింది. మంగళవారం తెల్లారేసరికి ఇండ్లలోకి నడుం లోతు నీళ్లు చేరాయి. దాదాపు 25 నుంచి 30 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ పరిధి హంటర్ రోడ్‍లోని ఎన్టీఆర్‍ నగర్‍, సాయినగర్‍, సంతోషి కాలనీ, బృందావన్‍ కాలనీ, ఎస్సార్‍ నగర్‍, సాయి గణేశ్‍ కాలనీ, చాకలి ఐలమ్మ కాలనీ, చిన్న వడ్డెపల్లి, గరీబ్‍ నగర్‍, మధురానగర్‍, నాగేంద్రనగర్, కీర్తి బార్‍ ఏరియా, డీకే నగర్‍, శాంతి నగర్‍, బొంది వాగు నాలా, మైసయ్యనగర్‍తో పాటు హనుమకొండలో అంబేద్కర్‍ భవన్‍, పోచమ్మకుంట, సమ్మయ్యనగర్‍, గోపాల్‍పూర్‍, ఇందిరమ్మ కాలనీ, దీన్‍దయాళ్ నగర్‍ తదితర కాలనీలు నీట మునిగాయి. ఎవరూ ఊహించని రీతిలో గంటల వ్యవధిలోనే ఇండ్లలోకి మోకాళ్ల లోతు వరద చేరింది. ఉప్పులు, పప్పులు, బట్టలు తదితర వస్తువులు తడిసిపోయాయి. బయటకు వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితి.. ఇంట్లో ఉందామంటే ఉండలేని దుస్థితి తలెత్తింది. దీంతో బాధితులందరూ బిల్డింగుల పైకెక్కి, సాయం కోసం ఎదురుచూశారు. బల్దియా ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి.. బోట్లు, ట్రాక్టర్ల ద్వారా బాధితులను బయటకు తీసుకొచ్చారు. కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ బాధితులను ఎక్కించుకుని.. హంటర్ రోడ్‍లోని సంతోషిమాత గార్డెన్‍లో ఏర్పాటు చేసిన షెల్టర్​కు తరలించారు. కాగా, ఉమ్మడి వరంగల్‍ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలు, అధికారులతో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సీపీ రంగనాథ్‍ స్వయంగా ట్రాక్టర్‍పై కాలనీల్లో తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

రోడ్డెక్కిన బాధితులు.. 

చెరువులు మత్తడి దుంకడంతో వరంగల్‍ నుంచి ఖమ్మం వెళ్లే నేషనల్‍ హైవేలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ రూట్​లో పంథని వద్ద, వర్ధన్నపేట దగ్గర్లోని ఇల్లంద వద్ద రోడ్డు పైనుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహించింది. దీంతో గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. నెక్కొండ మండలంలో లోట్లవాగు వద్ద, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల మధ్య లోలెవల్‍ కాజ్‍వే, నర్సంపేట నుంచి గురిజాల మార్గంలో, వరంగల్‍–-పర్వతగిరి నడుమ జమాల్‍పురం శివారులో కాజ్‍వే, గోపనపల్లి కాజ్‍వే వద్ద వరద ఉధృతంగా రావడంతో రాకపోకలు బంద్‍ అయ్యాయి. కాగా, వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో వరద ఇండ్లలోకి చేరింది. ఆగ్రహించిన బాధితులు.. ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ALSO READ :స్కూళ్లు, కాలేజీలకు.. ఇయ్యాల, రేపు సెలవు‌‌‌‌‌‌‌‌

సంగెం మండలంలో  21.8 సెం.మీ

వరంగల్‍ జిల్లాలోని 13 మండలాల్లో మంగళవారం భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగెం మండలంలో 21.8 సెంటీమీటర్లు, గీసుగొండలో 18, వర్ధన్నపేట, నల్లబెల్లిలో 17, రాయపర్తిలో 16, సిటీ పరిధిలో ఖిలా వరంగల్‍ లో 15, దుగ్గొండి మండలంలో 14 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. హనుమకొండ జిల్లా పరిధిలో ఆత్మకూర్‍ మండలంలో 17 సెంటీమీటర్లు, ఐనవోలు, పరకాల, శాయంపేటలో 13 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, ఇప్పటికే భారీ వర్షాలు కురవగా.. వరంగల్ రెడ్ జోన్ లో ఉండడంతో మరిన్ని భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి? అని ఆందోళన వ్యక్తమవుతున్నది.   .