
నెక్కొండ/ వరంగల్ సిటీ, వెలుగు: ఇటీవలే వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు స్పీడప్ చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం వరంగల్ జిల్లా నెక్కొండలో హైబ్రిడ్ వార్షిక నిర్వహణ కింద రోడ్ల భవనాల శాఖ ద్వారా రోడ్ల మరమ్మతులు, రీసర్వేసింగ్చేస్తున్న పనులను ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. ఆయా రోడ్లలోని కల్వర్టుల నిర్మాణం పూర్తిస్థాయిలో కంప్లీట్చేసి రాకపోకలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అంతకుముందు కలెక్టర్ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదాములను అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పరిశీలించారు. దేశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నిర్వహించిన పేరెంట్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 125 పాఠశాలల్లో విద్యార్థి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు వారి నైపుణ్యాలను వెలికి తీసే కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు.