వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైనా సైఫ్‌కు వరంగల్ కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..అతన్ని విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సైఫ్ను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. మార్చి 2 నుంచి నాలుగు రోజుల పాటు..సైఫ్ను పోలీసులు విచారించనున్నారు.
పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆదివారం కన్నుమూసింది. 5 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. ప్రీతి బ్రెయిన్ పని చేయడం పూర్తిగా ఆగిపోయిందని ఆదివారం మధ్యాహ్నమే కుటుంబ సభ్యులకు తెలియజేసిన నిమ్స్ డాక్టర్లు.. చివరకు రాత్రి 9:10 గంటలకు ఆమె మరణించిందని వెల్లడించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. ప్రీతి కోలుకుంటుందని ఐదు రోజులుగా ఎదురు చూసిన ఫ్రెండ్స్, బంధువులు విషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటూ పేరెంట్స్ కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని వారు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, ప్రీతి చావుకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా భయం కలిగేలా శిక్ష ఉండాలన్నారు. ఇందులో ఇంకా ఎవరు ఉన్నారనేది ఎంక్వైరీలో తేల్చి, వాళ్లందరికీ శిక్ష పడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ప్రీతి, సెకండ్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్‌కు నడుమ కొంత కాలంగా గొడవ జరుగుతోంది. వృత్తి పరమైన వివాదంతో మొదలై వేధింపులకు దాకా ఇది దారి తీసింది. ఈ నెల 18న ఓ కేసు షీట్‌కు సంబంధించి ప్రీతి పనితీరును తప్పుబడుతూ.. వాట్సప్ గ్రూపుల్లో సైఫ్ మెసేజ్‌లు పెట్టాడు. తనను అవమానపరిచేలా సైఫ్ వ్యవహరిస్తుండడాన్ని ప్రీతి తప్పుబట్టింది. ఏదైనా ఉంటే హెచ్‌వోడీకి ఫిర్యాదు చేయాలని, అందరిలో అవమానించేలా మెసేజ్‌లు పెట్టడమేందని సైఫ్‌ను ప్రశ్నించింది. దీంతో గొడవ మరింత ముదిరింది. ప్రీతికి బుర్ర లేదని, ఆమెకు సహకరించొద్దని సైఫ్ తన బ్యాచ్‌మేట్స్‌కు పర్సనల్‌గా మెసేజ్‌లు పెట్టాడు. ఈ విషయం ప్రీతికి తెలియడంతో ఒత్తిడికి గురైంది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధ పడింది. ఈ నెల 20న ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో, 21వ తేదీన అనస్థీషియా హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి.. ప్రీతి, సైఫ్‌ను పిలిచి ఇద్దరితో వేర్వేరుగా మాట్లాడాడు. అదే రోజు రాత్రి ప్రీతి నైట్ డ్యూటీకి వెళ్లింది. రాత్రి వచ్చిన ఎమర్జెన్సీ, ఇతర సర్జరీలకు హాజరైంది. అయితే తెల్లవారుజామున తనకు తలనొప్పి, చాతినొప్పి ఉందని ప్రీతి రూమ్‌కు వెళ్లిందని, తర్వాత నర్స్ వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్ ప్రకటించారు. వెంటనే ట్రీట్‌మెంట్ ప్రారంభించినా కోలుకోలేదన్నారు. ఆమె తనకు ఉన్న అనారోగ్య సమస్యకు ఇంజక్షన్ తీసుకుందని, ఆత్మహత్య చేసుకోవడానికి ఇంజక్షన్ తీసుకుందని వేర్వేరు ప్రచారాలు జరిగాయి. సైఫ్ వేధింపులతో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పగా, ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆధారాలు లేవని ఎంజీఎం డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రీతి తండ్రి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. వేధింపులు నిజమేనని తేల్చి సైఫ్‌ను అరెస్ట్ చేశారు.