హనుమకొండ సిటీ, వెలుగు: అందరి సహకారంతో వరంగల్ డీసీసీబీ బ్యాంక్ టర్నోవర్ రూ.893 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల టర్నోవర్ దాటిందని వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవిందర్ రావు తెలిపారు. సోమవారం నక్కలగుట్ట డీసీసీబీ భవనంలో ఆయన ఆధ్వర్యంలో మహాజన సభ జరిగింది.ఈ సందర్భంగా రవిందర్ రావు మాట్లాడుతూ బ్యాంకు పరిపాలన నివేదిక, ఆర్థిక సంవత్సరం 2024–25కు జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికేట్, బ్యాంకు జమ ఖర్చు, లాభనష్టాలు, ఆస్తులు, అప్పుల వివరాలను ప్రవేశపెట్టామన్నారు.
బ్యాంకు తన 32 శాఖల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, చేనేత సహకార సంఘాలు, బ్యాంకు ఖాతాదారులకు ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. సమావేశంలో డీసీసీబీ బ్యాంక్ సీఈవో వజీర్ సుల్తాన్, బ్యాంక్ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, నాబార్డు డీజీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు.