
- ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్
- బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ
- పరస్పర మాటల యుద్ధంతో హీటెక్కిన తూర్పు రాజకీయం
వరంగల్, వెలుగు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ట్రయాంగిల్ పొలిటికల్ వార్ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తామని బీజేపీ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌లో బరిలో ఉండే అవకాశం ఉంది. టికెట్లు కన్ఫర్మ్ కాకముందే ముగ్గురు లీడర్లు పోటాపోటీగా నియోజకవర్గంలో తిరుగుతూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో వరంగల్ తూర్పు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి...
గతంలో కార్పొరేటర్‌గా, మేయర్‌గా పనిచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నియోజకవర్గంలో తనకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీలోనూ తనకు పోటీ అవుతారని భావించే నేతలు ఎదగకుండా కేడర్‍ను కట్టడి చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో అలర్ట్ అయ్యారు. దీంతో ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాలంటూ డివిజన్ బాట పట్టారు. నిత్యం ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
సమస్యలు తెలుసుకోవడం, చేరికలకు ప్రయారిటీ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుకు ప్రదీప్‍రావు తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతను గతంలో వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేయడంతో పాటు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కొన్ని రోజులు బీఆర్‌ఎస్‌లోనూ పనిచేయడంతో అక్కడా తనకంటూ ఓ వర్గం ఉంది. ఇప్పుడు బీజేపీలో చేరడంతో బలం మరింత పెరిగినట్లైంది. దీంతో పాటు యూత్, ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు మరో రౌండ్ జనాల్లో తిరుగుతున్నారు. మరో వైపు ఇంతకాలం రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు మరో సారి రంగంలోకి దిగారు. యూత్ ఓటర్లను టార్గెట్ చేసి చేరికలకు ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే అధికార పార్టీ నుంచి నరేందర్‍కు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రదీప్‌రావు, సురేఖకు తూర్పు టికెట్ ఇస్తున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ హైకమాండ్ తప్పనిసరిగా అవకాశం కల్పిస్తుందన్న నమ్మకంతో ముగ్గురు లీడర్లు ముందస్తు ప్రచారం చేసుకుంటున్నారు.
మాటల యుద్ధానికి దిగుతున్న లీడర్లు
తూర్పు నియోజకర్గంలో తిరుగుతున్న ముగ్గురు లీడర్లు వివిధ కార్యక్రమాలను వేదికగా చేసుకొని మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఎమ్మెల్యే నరేందర్ గతంలో ప్రదీప్‍రావును ఉద్దేశించి ‘నరుకుతా.. చీరేస్తా..’ వంటి వార్నింగ్‌లు ఇవ్వడంతో పాటు, కుటుంబ సభ్యులను తిట్టే వరకు వెళ్లాడు. కొండా దంపతుల విషయంలోనూ నరేందర్ ఇలాగే దురుసుగా మాట్లాడారు. రాజకీయాల్లో వారి పని అయిపోయిందని, కనీసం ఒక్క కార్పొరేటర్‍ను కూడా గెలిపించుకోలేకపోయారని సెటైర్లు వేశాడు. దీనికి ఇద్దరు లీడర్లు సైతం తగిన పద్ధతిలో రిప్లై ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రచార హడవుడి మొదలవడంతో ఈ సారి తూర్పుపై జెండా పాతేది ఎవరోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.