వరంగల్, వెలుగు: పెళ్లి అయినా పుట్టింట్లోనే ఉంటున్న అక్క బాధను చూడలేక బావను, అతడి తండ్రిని చంపేయాలని ఆమె తమ్ముడు ప్లాన్ వేయగా.. ఘటనలో మామ చనిపోగా, బావ తప్పించుకున్నాడు. ఈ నెల 23న వరంగల్ కరీమాబాద్ ఎస్సార్ తోటలో నముతబాజీ రాంచందర్(68) హత్య కేసులో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. సెంట్రల్ జోన్ డీసీపీ బారీ, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ వివరాలు వెల్లడించారు.. వరంగల్‌కు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ నముతబాజీ రాంచందర్ (68) కొడుకు త్రిలోక్ చందర్‍తో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగాజ్ నగర్‍కు చెందిన సాపూర్ అరుణతో 20 ఏండ్ల కింద పెళ్లి చేశారు.
కొన్నేండ్లు కాపురం చేశాక అరుణ అనారోగ్యానికి గురైందనే కారణంచెప్పి త్రిలోక్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో అరుణ కుటుంబ సభ్యులు త్రిలోక్ తండ్రి రాంచందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో రాంచందర్ తన కొడుకు చెడు అలవాట్లకు బానిసయ్యాడంటూనే అతడికే సపోర్ట్‌గా నిలిచాడు. పంచాయితీ పెట్టించి ఇద్దరికి విడాకులు ఇచ్చేలా ఒప్పందం రాసుకున్నారు. దీనికిగానూ కొంత డబ్బులు ఇచ్చేలా ఒప్పుకున్నారు. దాదాపు 15 ఏండ్ల కింద ఇదంతా జరగగా అరుణ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కాగా, మటన్ షాపు నిర్వహించే బాధితురాలి తమ్ముడు షాపూర్ అనిల్ 15 ఏండ్లుగా జనాల సూటిపోటి మాటలతో తన అక్క మానసికంగా కుంగిపోవడం చూసి మనస్తాపం చెందాడు. 10 ఏండ్ల కింద తండ్రి మరణించగా.. 6 నెలల కింద తల్లి చనిపోయింది. దీంతో అరుణ ఇంకా ఒంటరి అయింది. అదే టైంలో త్రిలోక్ మాత్రం మరో మహిళను పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. అరుణ, త్రిలోక్ విడాకుల ముచ్చట టైంలో ఇస్తామన్న డబ్బులు ఇవ్వట్లేదనే కోపం సైతం ఉంది.
బావ, మామను చంపేద్దామని ప్లాన్
అనిల్ తన 15 ఏండ్ల పగను తీర్చుకోవడంలో భాగంగా.. అక్క భర్త త్రిలోక్, అతడి తండ్రి రాంచందర్‍ను ఎలాగైనా హత్య చేయాలనుకున్నాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం రెండు నెలల కింద వరంగల్ వచ్చిన అనిల్.. వరంగల్ కరీమాబాద్‌లో త్రిలోక్ ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. మర్డర్ చేసేందుకు కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన తన మిత్రుడు నారాయణదాసు అరుణ్ కుమార్ హెల్ప్ తీసుకున్నాడు. బావ, మామను చంపేందుకు ఈ నెల 22న వారి ఇంటికి వెళ్లగా త్రిలోక్ ఇంట్లో లేడు. దీంతో 23న మరోసారి వెళ్లారు. మర్డర్ చేసి వచ్చేలోగా బైక్‍తో రెడీగా ఉండాలని అరుణ్‍కు చెప్పి అనిల్ ఇంట్లోకి వెళ్లాడు. త్రిలోక్ లేకపోవడంతో ఇక అతడి తండ్రి రాంచందర్‍ను గొంతు కోసి చంపాడు. ఆపై ఇక్కడినుంచి పరారయ్యారు.
రంగంలోకి ఐటీ కోర్..
సిటీ నడిబొడ్డున పొద్దున11 గంటలకు మర్డర్ జరగడంతో పోలీసులు కేసును సీరియస్‍గా తీసుకున్నారు. సీపీ రంగనాథ్ ఆదేశాలతో మిల్స్ కాలనీ పోలీసులతో పాటు ఐటీ కోర్, టాస్క్‌ఫోర్స్ టీంలు రంగంలోకి దిగాయి. నిందితుల ఊహా చిత్రాలను గీయించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. బైక్ ఆధారంగా మొబైల్ నంబర్లు తెలుసుకుని నిందితుల కదలికలపై కన్నేశారు. మర్డర్ తర్వాత కాగజ్ నగర్ వెళ్లిన అనిల్, అరుణ్ హైదరాబాద్ వెళ్లే క్రమంలో పోలీసులు వారిని వరంగల్‌లోని నిందితుడి చుట్టాల ఇంట్లో పట్టుకున్నారు. తక్కువ టైంలో కేసును ఛేదించిన మిల్స్ కాలనీ, ఐటీ కోర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సురేశ్, సంతోష్, పి.దేవేందర్, రాంబాబును సీపీ రంగనాథ్ అభినందించారు.