​బూజుపట్టిన పచ్చళ్లు అమ్ముతున్న దంపతుల అరెస్ట్

హనుమకొండ, వెలుగు:  వరంగల్ కాశిబుగ్గ తిలక్​ నగర్​ ప్రాంతంలో  బూజు పట్టిన పచ్చళ్లు అమ్ముతున్న  దంపతులను  మంగళవారం వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.  టాస్క్​ ఫోర్స్​ ఏసీపీ  ఎం.జితేందర్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  తిలక్​ నగర్​లో  మార్త అంజయ్య, సులోచన దంపతులు కొంతకాలంగా పచ్చళ్ల బిజినెస్​ చేస్తున్నారు.  ఫుడ్​ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్​ లేకుండానే ఉసిరి, మామిడి, చింతకాయ, టమాట, నిమ్మకాయ తదితర పచ్చళ్లు తయారు చేస్తూ  వాటిని డ్రమ్ముల్లో  నిల్వ ఉంచుతున్నారు. 

బూజు పట్టి, ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకోకుండా వాటినే  సిటీలోని దుకాణాలకు సప్లై చేస్తున్నారు.  విషయం తెలుసుకున్న టాస్క్​ ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేసి  వారిని అదుపులోకి తీసుకున్నారు.  రూ.5.2 లక్షల విలువైన 30 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసిన 52 క్వింటాళ్ల పచ్చళ్లు, వాటికి అవసరమయ్యే పదార్థాలను స్వాధీనం 
చేసుకున్నారు.