ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​.. ఇంకెప్పుడు..?

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​.. ఇంకెప్పుడు..?
  • ఫ్రూట్ ​బిజినెస్​ కు అడ్డాగా మారిన రోడ్డు 
  • వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ కు కలగని మోక్షం​ 
  • స్లాబ్​ దశలోనే ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ పనులు
  • వ్యాపారులకు సరైన అడ్డా లేక ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ లో ఫ్రూట్​బిజినెస్​ చేసే వ్యాపారులకు రోడ్డే దిక్కైంది. గతంలో ఉన్న పండ్ల మార్కెట్ స్థానంలో ఇంటిగ్రేటెడ్​ వెజ్, నాన్​ వెజ్​మార్కెట్​ నిర్మిస్తుండగా, మూడేండ్లు దాటినా పనులు సగం కూడా పూర్తి కాలేదు. ఫలితంగా అక్కడ ఫ్రూట్స్​ బిజినెస్​ చేసే వ్యాపారులకు అడ్డా కరువైంది. ఆ పక్కనే ఉన్న రోడ్డుపై బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ మార్కెట్​లో కనీసం తాగునీరు, టాయిలెట్స్​లాంటి సదుపాయాలు కూడా లేక అవస్థలు 
పడుతున్నారు.

ఆరు నెలల్లో కంప్లీట్​చేస్తమన్నరు..

వరంగల్ లక్ష్మీపురంలో వెజిటేబుల్స్​వ్యాపారానికి మోడల్​ మార్కెట్​అందుబాటులో ఉండగా, ఇంటిగ్రేటెడ్​వెజ్, నాన్​వెజ్, ఫ్రూట్​మార్కెట్​నిర్మించేందుకు గత ప్రభుత్వం 2021లో ప్రణాళికలు రచించి, అదే ఏడాది జీడబ్ల్యూఎంసీ ఎన్నికల ముందు ఏప్రిల్​12న వరంగల్ నగరానికి వచ్చిన అప్పటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​, స్థానిక నేతలంతా కలిసి ఇంటిగ్రేటెడ్​మార్కెట్​కు శంకుస్థాపన చేశారు. 

రూ.24 కోట్లతో పనులు చేపట్టి,  ఆరు నెలల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మొదటి దఫా కొంతమేర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ ఫండ్స్​తో మార్కెట్​పనులు స్లాబ్​ లెవల్​ వరకు పూర్తి కాగా, ఆ తర్వాత నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్స్ వర్క్స్ ఆపేశారు. దీంతో దాదాపు రెండేండ్ల నుంచి పనులు ముందుకు సాగక, బిల్డింగ్ కాస్త ఇల్లీగల్​ యాక్టివిటీస్​ కు అడ్డాగా మారుతోంది.

ఒకటికీ, రెంటికీ ఇబ్బందే..

లక్ష్మీపురం పండ్ల మార్కెట్​లో హోల్​ సేల్​ మర్చంట్స్​ 34, రిటైల్​వ్యాపారులు 82 మంది వరకు ఉండగా, వివిధ రకాల ఫ్రూట్స్​ బిజినెస్​ చేసే చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు నిత్యం వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చిపోతుంటారు. అందులో మహిళల సంఖ్యే అధికం. ఇక్కడ టాయిలెట్స్ సదుపాయం కూడా లేకపోవడంలో వ్యాపారాలు సాగించే వాళ్లంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటికీరెంటికీ వెళ్లాలన్నా ఇబ్బందులు  పడాల్సి వస్తోందని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని చెబుతున్నారు.  

ట్రాఫిక్​ పోలీసులతోనూ సమస్యలే..

గత ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోవడంతో అక్కడి వ్యాపారులంతా రోడ్డు మీద పడినట్లయ్యింది. కొత్త మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోవడం, తమకు అడ్డాలు కేటాయించకపోవడంతో హోల్​సేల్, రిటైల్​వ్యాపారులంతా మార్కెట్​ చుట్టూ ఉన్న రోడ్డుపై అడ్డాలు పెట్టుకుని పండ్లు అమ్ముతున్నారు. దీంతో లక్ష్మీపురం రోడ్డు కాస్త ఇరుకుగా మారి వాహనాలు, జనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

 ఇదే అదునుగా కొంతమంది ట్రాఫిక్​ పోలీస్​ సిబ్బంది రోడ్లపై బిజినెస్​ చేసుకుంటున్న చిరు వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉందని చెప్పి తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఇంటిగ్రేటెడ్​మార్కెట్​పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.