గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు లైన్‌ క్లియర్

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు లైన్‌ క్లియర్
  • నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారుల వెల్లడి 
  • ఆర్బిట్రేషన్​ ద్వారా ఎకరానికి రూ. 20 లక్షల పరిహారం 
  • ధరణిలో లేని భూములకు నో క్లారిటీ
  • వానకాలంలో పంటలు వేయొద్దని ఇప్పటికే రైతులకు సూచనలు

పెద్దపల్లి, వెలుగు :- పెద్దపల్లి జిల్లా మీదుగా నిర్మించనున్న వరంగల్–మంచిర్యాల గ్రీన్​ఫీల్డ్​నేషనల్​ హైవేకు లైన్‌ క్లియర్‌‌ అయింది. హైవే నిర్మాణ పనులను నెలలో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా ఎకరానికి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో నిర్వాసిత భూముల్లో ఈ వానకాలం పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. కాగా నిర్వాసిత భూముల్లో కొన్ని ధరణిలో లేకపోవడంతో వాటికి పరిహారం విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి భూములపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు భూముల కోల్పోతున్న రైతుల విషయమై ఇటీవల కలెక్టర్​శ్రీహర్ష అధికారులతో మీటింగ్‌ నిర్వహించి చర్చించారు. 

కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ 

వరంగల్–మంచిర్యాల 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​ జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ హైవే కోసం పెద్దపల్లి జిల్లాలో  మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని 16 గ్రామాల్లో దాదాపు 1400 మంది రైతులకు చెందిన  500 ఎకరాలు సేకరిస్తున్నారు.  ఇప్పటి వరకు 300 మంది రైతులకు రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించినట్లు అధికారులు చెప్తున్నారు. రైతులకు పరిహారం చెల్లింపులు స్పీడప్‌ చేయాలని తహసీల్దార్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. 

ఆర్బిట్రేషన్ ప్రక్రియ ద్వారా  రైతులకు దాదాపు ఎకరానికి రూ.20 లక్షల వరకు వచ్చే అవకాశముందని, దీంతో ఆ విషయంలో రైతులను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  ప్రతి మండలంలో గ్రామాల వారీగా సేకరించాల్సిన భూమిని, తొందరలోనే  హైవే అథారిటీకి అప్పగించేందుకు  చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తిచేసి పనులు స్టార్ట్​ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో హైవే కింద పోతున్న  500 ఎకరాల్లో వానకాలం పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. 

ధరణిలో లేని భూములపై క్లారిటీ లేదు 

ధరణిలో నమోదు కాకుండా హైవేలో పోతున్న భూములకు సంబంధించి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ధరణిలో ఉన్న వారి భూములకే చట్ట​ప్రకారం పరిహారం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈలెక్కన పెద్దపల్లి జిల్లాలో దాదాపు 200 ఎకరాలు ధరణిలో నమోదు కాలేదు. దీంతో ఈ భూములకు చెందిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా సాదాబైనామానాలను ఆన్​లైన్​ చేసుకోవడం కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ  ఇప్పటివరకు పట్టా పాస్‌బుక్​ ఇవ్వలేదు. 

ధరణిలోనూ నమోదు చేయలేదు. కాగా ధరణిలో లేని భూములను సైట్​మీద పరిశీలించి ప్రభుత్వ పరంగా పట్టా చేసుకొని పరిహారం అందేలా చూస్తామని అధికారులు చెప్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.  దీన్ని  రైతులు నమ్మడం లేదు. హైవేలో పోతున్న భూముల విషయంలో ధరణిలో లేని భూములపై క్లారిటీ ఇవ్వాలని, అలాగే సాగులో ఉన్న ప్రతీ ఒక్కరికీ పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.