జూన్ 17వ తేదీన కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా.. ఎంజీఎం ఆసుపత్రి నుండి ములుగు రోడ్డు వరకు ఫుట్ పాత్ పై చిరు వ్యాపారుల షాపులను కూల్చివేశారు. జేసీబీలతో షాపులను నెలమట్టం చేశారు. షాపులో వస్తువులు, ఇతర సామాగ్రిని కూడా పట్టించుకోలేదు. వేల ఖరీదు చేసే వస్తువులు, షాపులను అకస్మాత్తుగా కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 17వ తేదీన మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను, తోపుడు బండ్లును మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధినిచ్చే దుకాణాలను తొలగించి తమ జీవితాలను రోడ్డున పడేశారని అవేదన వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా ఇదే రోడ్డుపై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. షాపుల తొలగించి తమ పొట్ట కొడుతున్నారని చిరు వ్యాపారులు మండిపడ్డారు.