
- 77.50 గ్రాముల గోల్డ్, రూ.8 లక్షల10వేలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్ సింగ్
హనుమకొండసిటీ, వెలుగు: వేర్వేరు ఘటనల్లో బంగారం దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు చైన్ స్నాచర్లు, కారులో డబ్బును దొంగలించిన కారు డ్రైవర్ ను వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కమిషనరేట్‌లో సీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 11న వరంగల్ కోటకు చెందిన చాపర్తి రాజేశ్హనుమకొండ రెడ్డికాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. గతంలోనూ కేయూ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున నాలుగు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు.
హనుమకొండ గోకుల్ నగర్ లో నివాసం ఉంటున్న తాళ్లపల్లి సంపత్ కుమార్, నడికూడ మండలానికి చెందిన చుక్క మురళి ఈనెల 21న ఫాతిమానగర్ లోని ఓ కిరాణం షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నట్లు నటించి కిరాణం షాపు యజమానురాలు మెడలో నుంచి 2.7 గ్రాముల బంగారంతో కూడిన రోల్డ్ గోల్డ్ గొలుసును ఎత్తుకెళ్లారు. వనస్థలిపురానికి చెందిన కార్తీక్ గూడమల్ల వినయ్ కుమార్ అనే హోటల్ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఈ నెల 18న భీమారం దగ్గర ఉన్న ఓ హోటల్‌రూంలో యజమాని బస చేయగా, భోజనానికి వెళ్తున్నానని చెప్పి కారులో ఉన్న రూ.8 లక్షలతో పారిపోయాడు. ఆయా ఘటనల్లోని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.4లక్షల 90వేలు విలువచేసే 77.50 గ్రాముల బంగారం, రూ.8లక్షల 10వేలు, ఆటో, బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్న క్రైమ్ డీసీపీ బెదరకోట జనార్దన్, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు మధుసూదన్, దేవేందర్ రెడ్డి, నందిరాంనాయక్, తిరుమల్, ఇన్స్పెక్టర్లు బాలాజీ, సతీశ్, రవికుమార్, సుధాకర్ రెడ్డి, ఏఏవో సల్మాన్ పాషాను సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.