
- మరో 15 మందికి సామాజిక సేవ చేయాలని తీర్పు
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రూ.15 లక్షల 72 వేలు జరిమానా
- గతేడాది 96 మందికి జైలుశిక్షలు, 20,338 కేసులు
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనాలు లిక్కర్ తాగి వాహనాలు నడిపే క్రమంలో పోలీసులు జైలు శిక్షలు పడేలా కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న సన్ప్రీత్సింగ్ప్రధానంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలిచ్చారు. దీంతో గ్రేటర్ సిటీ, మున్సిపాలిటీ అనే తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసే అడ్డాలు పెంచారు.
ఒక్క నెలలో సగం కంటే ఎక్కువ టార్గెట్..
వరంగల్ కమిషనరేట్‌లో గతేడాదితో పోలిస్తే.. అప్పుడు నమోదైన కేసుల్లో సగం కంటే ఎక్కువ ఈ ఏడాది కేవలం ఒక్క నెలలో పూర్తి చేశారు. పోలీస్ అధికారులు కేవలం ఒక్క నెలలో అత్యధికంగా మద్యం తాగి బండి నడిపిన 3,029 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇందులో కోర్టుల ద్వారా 53 మందికి జైలు శిక్షలు పడ్డాయి. మరో 15 మందిని సామాజిక సేవ చేసేలా న్యాయమూర్తి శిక్షలు విధించారు. కేసుల ద్వారా రూ.15 లక్షల 72 వేలు జరిమానా రూపంలో వసూలు చేశారు.
కాగా, ఇదే పోలీస్ కమిషనరేట్‌లో 2024 ఏడాది మొత్తం కలిపి 96 మంది మాత్రమే జైలు శిక్షల వరకు వెళ్లారు. ఈ ఏడాది మాత్రం కేవలం ఒక్క నెలలోనే 53 మందికి శిక్షలు ఖరారు కావడంతో పోయినేడాది కేసుల్లో సగం కంటే ఎక్కువగా నెలలోనే అయినట్లయింది. 2024లో మొత్తం 20,338 డ్రంక్అండ్ డ్రైవ్ కేసులు నమోదవగా సగటున నెలకు 1694 కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మాత్రం ఒక్కటే నెలలో అత్యధికంగా 3,029 కేసులు నమోదు చేశారు.
పోలీసులతో నిండుతున్న జంక్షన్లు..
గ్రేటర్ వరంగల్ పరిధిలో సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు జంక్షన్లన్నీ పోలీసుల చేతిలో లిక్కర్ రీడింగ్ మిషన్లతో కనపడ్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మోతాదుకు మించి ఎక్కువ రీడింగ్ వచ్చిన వారిపై కేసు నమోదు స్లిప్పులు చేతిలో పెడ్తున్నారు. ఎవరైనా న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేసినా, సెలబ్రిటీ, పొలిటికల్ ముసుగులో వార్నింగులు ఇచ్చినా పోలీసులు ప్రత్యేక కెమెరాల ద్వారా సదరు వ్యక్తుల మాటలు, నడవడిక మొత్తం షూట్ చేస్తున్నారు.
దానిని కోర్టుల ముందు ఎవిడెన్స్‌గా పెడ్తున్నారు. కోర్టుకు వెళ్లడానికి ముందు కేసుల్లో ఉన్న వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించే ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెంచడంతో సిటీ జనాలు మద్యం సేవించి రోడ్లపైకి ఎక్కాలంటే వణికిపోతున్నారు.
సిటీ, రూరల్ అంతటా టెస్టులు పెడతాం..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై సీరియస్‌గా వ్యవహరిస్తాం. గ్రేటర్ ఏరియా, రూరల్ ప్రాంతమనే తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి, మోతాదుకు మంచి రీడింగ్ వస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. దీనిని రెగ్యూలర్ చేస్తాం. వాహనదారులు సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరడంలో భాగంగానే కొంత కఠినంగా వ్యవహరిస్తాం. - సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్