భూములు తీసుకుని.. కొలువులు ఇవ్వట్లేదు!

భూములు తీసుకుని..  కొలువులు ఇవ్వట్లేదు!
  • వరంగల్  టెక్స్ టైల్ పార్కులో స్థానికేతరులకే ఉద్యోగాలు
  • భూ నిర్వాసితుల కుటుంబాలకు 80 శాతం హామీ వట్టిదే
  • గతంలో చెత్త మోసుడు.. సెక్యూరిటీ గార్డులుగానే రిక్రూట్  
  • కైటెక్స్ కంపెనీ 25 వేల జాబ్ ల్లో లోకల్ కు ఇవ్వని ప్రయారిటీ
  • పరకాల ఎమ్మెల్యే జాబ్‍ మేళాలోనూ పాల్గొనని కైటెక్స్ సంస్థ 
  •  కొలువులు ఇవ్వకపోవడంపై స్థానికుల ఆగ్రహం

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ జిల్లాలోని  కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో స్థానికులకే 80 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన హామీ వట్టిదే అయింది.  పార్కులో పెట్టే కంపెనీల్లో భూ నిర్వాసిత కుటుంబాలకు  జాబ్ లు ఇచ్చాకే ఇతర ప్రాంతాలవారికి కల్పిస్తామనే మాట గాలికి వదిలేశారు.  గత  సర్కార్  చెప్పినట్టు ఏ ఒక్క  కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇండ్లు కూడా ఇవ్వలేదు. స్థానికులకే తొలి అవకాశాలని హామీ ఇచ్చిన గత ప్రభుత్వ పెద్దలు.. కంపెనీ ఇచ్చే జాబ్ ల్లో ఎక్కడా స్థానికత ప్రస్తావనే ఉండడంలేదు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఫామ్ టూ ఫ్యాషన్‍ కాన్సెప్ట్ అని చెప్పిన కేటీఆర్

వరంగల్‍ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి వద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో 2016లో  రైతుల నుంచి 1, 357 ఎకరాలను గత సర్కార్  తీసుకుంది. 2017 అక్టోబర్‍ 22న అప్పటి సీఎం కేసీఆర్ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. కంపెనీలు క్యూ కడుతున్నాయని,  భూములిచ్చిన రైతులకు ఇంటికో జాబ్‍.. మెయిన్‍ రోడ్డులో డబుల్‍ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.  ఆ తర్వాత   ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‍ కంపెనీల శంకుస్థాపనకు వచ్చారు.  

ఫామ్ టూ ఫ్యాషన్‍ కాన్సెప్ట్ తో   పార్క్ ఏర్పాటు చేశామని..  ఇందుకు దాదాపు రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.  ప్రత్యక్షంగా 34 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందితో  దాదాపు 65 వేల మందికిపైగా ఉద్యో గ, ఉపాధి దొరుకుతుందని స్పష్టంచేశారు. 22 కంపెనీలతో రూ.3,900 కోట్లకుపైగా ప్రాజెక్టులకు అగ్రిమెంట్ చేసుకున్నారు. 

చెత్త మోసే హమాలీ.. సెక్యూరిటీ గార్డుగానే..

 కాగా ఏడేండ్లలో గణేషా ఎకో పెట్‍, ఎకోటెక్‍  పేర్లతో కంపెనీ 50 ఎకరాల్లో రూ.588 కోట్లతో రెండు యూనిట్లు ప్రారంభించింది. ఇందులో 1,000 జాబ్ ల్లో 80 శాతం పెద్ద కొలువులు బయటి వారికే ఇచ్చింది. కేవలం  హమాలీ, సెక్యూరిటీ గార్డు వంటి కొన్నింటిని స్థానిక రైతు కుటుంబాలకు ఇచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన యంగాన్‍ కంపెనీ 8 ఫ్యాక్టరీలు పెడ్తున్నట్లు చెప్పినా..అవి పూర్తిస్థాయిలో రాలేదు. చెప్పిన ఉద్యోగాలివ్వలేదు.  గతేడాది జూన్‍ 28న 'కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో..స్థానికేతరులకే ఉద్యోగాలు’ పేరుతో వెలుగు పేరులో స్టోరీ పబ్లిష్ అయింది. దీనిపై స్పందించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశరెడ్డి కంపెనీల్లో స్థానికులకే 80 శాతం కొలువులు దక్కేలా హెచ్‍ఆర్‍డీ ఆఫీసర్లను ఆదేశించారు. 

కైటెక్స్ 25 వేల జాబ్ ల్లోనూ కనిపించని 'స్థానికత' 

కేరళకు చెందిన కైటెక్స్ సంస్థ 2021 జులై 7న పార్కులోని 187 ఎకరాల్లో రూ.1200 కోట్లతో  పిల్లల దుస్తుల తయారీ యూనిట్‍ పెట్టేందుకు పనులకు శంకుస్థాపన చేసింది. నాలుగేండ్లుగా నిర్మాణ పనులు కొనసాగిస్తోంది.  గత వారం కైటెక్స్ తెలంగాణ పేరుతో కంపెనీ 25 వేల జాబ్ లకు పేపర్‍ ప్రకటన ఇచ్చింది.

 మేనేజర్లు, మెకానికల్‍, సివిల్‍, ఎలక్ట్రిక్‍ ఇంజనీర్లు, సూపర్‍వైజర్లతో పాటు దుస్తుల తయారీలోని12 రకాల విభాగాల్లో రిక్రూట్ ఉంటుందని తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తప్పితే.. ఇందులో స్థానికతకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ సంస్థ ప్రకటన తర్వాతే.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి గత శుక్రవారం స్థానిక యువత కోసం జాబ్‍ మేళా నిర్వహించారు. అందులోనూ కైటెక్స్ సంస్థ పాల్గొనలేదు. 

కొలువులిస్తమంటేనే భూములిచ్చినం 

 పార్కులో పెద్ద కంపెనీలొస్తాయి. మీకు, మీ పిల్లలకు ఉద్యోగాలొస్తయి. పార్కులోనే ఇండ్లు కట్టిస్తాం. ఉన్న భూములకు కోట్లలో డిమాండ్‍ వస్తదని చెప్పి అప్పట్లోనే ఎకరం రూ.50 లక్షల రేటుండే భూములకు రూ.10 లక్షలిచ్చి ఇచ్చారు.  భూములియ్యమని బతిలాడినా నోటీసులు ఇచ్చి బలవంతంగా తీసుకున్నారు.  తీరా చూస్తే..  కొలువులు రాలే. డబుల్‍ ఇండ్లు ఇయ్యలే.  – ఎస్‍.స్వామి, భూ నిర్వాసితుడు

మా పిల్లలకు అవకాశం ఇవ్వాలి 

పార్కు పెడ్తమని చెప్పినప్పుడు ఏడాది, రెండేండ్లలో మా పిల్లలకు కంపెనీల్లో ఉద్యోగాలిస్తారు. బయటకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేస్కుంటరు అనుకున్నాం. ఏడెనిమిదేండ్లు రాలేదు.  ఇప్పుడొచ్చే పెద్ద కంపెనీలోనైనా మా పిల్లలకే ఉద్యోగాల్లో అవకాశమివ్వాలే.  – కవిత, బాధిత మహిళా రైతు