గ్రేటర్​ వరంగల్లో చెడ్డీ అండ్​ టాటూ గ్యాంగ్

గ్రేటర్​ వరంగల్లో   చెడ్డీ అండ్​ టాటూ గ్యాంగ్
  • పట్టణంలో హల్​చల్​ చేస్తున్న ముఠా​    
  • ముఖానికి మాస్కులు, నడుముకు కత్తులు
  • బంగారుపూత వెంకన్న విగ్రహాన్ని పట్టుకెళ్లిన్రు 
  • లేదంటే తమపై దాడి చేసేవారన్న ముగ్గురు ఇంటిసభ్యులు 
  • సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు.. రంగంలోకి పోలీసులు 
  • చోరీకి ముందు ఒక డ్రెస్.. తర్వాత మరో డ్రెస్

వరంగల్‍, వెలుగు: గ్రేటర్​ వరంగల్లో 'చెడ్డీ అండ్‍టాటూ' గ్యాంగ్‍హల్‍చల్‍  చేసింది. చెడ్డీలు ధరించి, చేతులపై టాటూలు వేసుకున్న ఆరుగురు సభ్యుల ముఠా 24 గంటలు బిజీగా ఉండే కేయూ వంద ఫీట్ల రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో రెండు గంటలపాటు లోపలే ఉండి చోరీకి పాల్పడటం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. బాధితులు, పోలీసుల వివరాల  ప్రకారం.. హనుమకొండ కేయూ జంక్షన్​ నుంచి పెగడపల్లి డబ్బాల వైపు వెళ్లే మెయిన్​ రోడ్డులో కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గేటు సమీపంలో రోడ్డును ఆనుకుని బత్తిని వెంకటనారాయణ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

గురువారం తెల్లవారుజామున 1.40 దాటాక ఆరుగురు సభ్యుల ముఠా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. దాదాపు రెండు గంటలపాటు చోరీ పాల్పడ్డారు. వారిని ఎవరూ గుర్తించకుండా ముఖానికి నల్లని మాస్కులు ధరించారు. దాదాపు అందరికీ  మోచేతి కింద గుండ్రటి వెడల్పు టాటూలు ఉన్నాయి. నడుం చుట్టూ కత్తులతోపాటు దాడి చేయడానికి వారివద్ద మరిన్ని మారణాయుధాలున్నాయి. లోపలకు వచ్చిన చెడ్డీ టాటూ గ్యాంగ్​ ఎదురుగా సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. మరో కెమెరా స్కీన్‍పై అక్కడే ఉన్న బురద మట్టిని రాశారు. మెయిన్‍డోర్​ ఓపెన్‍  చేసే ప్రయత్నం చేశారు. 

ఈ ప్రాంతం కేయూ మెయిన్‍ రోడ్డుపై వెళ్లేవారికి కనిపించేలా ఉండటంతో ఆపై ఓ బెడ్‍రూంకు సంబంధించి కిటికీ గ్రిల్స్​ తొలగించి లోపలకు వెళ్లారు. అక్కడున్న బీరువా ఓపెన్​ చేశారు. అందులో ఇంటి సభ్యులకు ఓ కార్యక్రమంలో టీటీడీ తరఫువారు బహూకరించిన బంగారు పూతతో ఉన్న వేంకటేశ్వరస్వామి విగ్రహం, మరో రెండు కాయిన్స్​ చూశారు. వాటిని నిజమైన బంగారు విగ్రహం, బిల్లలుగా భావించారు. అప్పటికే తెల్లవారుజాము 3.30 గంటలు దాటడంతో అదే ఇంట్లోని రెండు బెడ్‍రూముల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. దర్జాగా లోపల వైపు నుంచి మెయిన్‍డోర్‍ తీసుకుని బయటకు వెళ్లిపోయారు. కాగా, దొంగల ముఠా వెళ్లని రెండు బెడ్‍రూముల్లోనే ఇంటి భార్యభర్తలు, వారి కుమారుడు నిద్రించారు. 

చోరీ జరిగిన కాసేపటికే నిద్రలేచిన కుటుంబ సభ్యులు ప్రధాన ద్వారం తెరిచి ఉండటాన్నిచూసి షాక్‍ అయ్యారు. బెడ్‍రూం, కిచెన్‍, ఇతర ప్రాంతాల్లో చిందరవందరగా పడేసి ఉన్నవస్తువులను చూసి 100  సమాచారమిచ్చారు. హనుమకొండ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

మిగతా సీసీ కెమెరాలను పరిశీలించారు. చెడ్డీలతోపాటు ఒకే రకమైన టాటూలు వేసుకున్న ముఠా సభ్యులను గుర్తించారు. వారిని అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా భావించిన ఉన్నతాధికారులు విషయం బయటకు పొక్కకుండా గ్రేటర్‍ పోలీసులను అలెర్ట్​ చేశారు. గురువారం ముమ్మర పెట్రోలింగ్‍ నిర్వహించారు. సిటీలోని సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా గ్యాంగ్​ సమాచారం పట్టుకునే పనిలో ఉన్నారు.

చోరీకి ముందు ఒక డ్రెస్.. తర్వాత మరో డ్రెస్ 

చోరీ ఘటనలో పాల్గొన్న చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి ముందు ఒక డ్రెస్, చేశాక మరొక డ్రెస్ వేసుకోవడం ద్వారా పోలీసులకు చిక్కకుండా స్కెచ్ వేస్తోందని తెలిపారు. దొంగలు చోరీ చేసే క్రమంలో చెడ్డీ బనియన్ మీద ఉంటూ, అనుకున్న పని పూర్తి చేయగానే క్షణంలో వారి వెంట ఉండే ప్యాంటు, షర్టు వేసుకుని దర్జాగా వెళ్లిపోతున్నారు. దీంతో సీసీ కెమెరాల్లో వీరిని గుర్తుపట్టడం కొంత ఇబ్బందిగా మారిందని పోలీసులు  తెలిపారు.