
- వరంగల్ జూలో సమ్మర్ ఎఫెక్ట్ లేకుండా చర్యలు
- వన్య ప్రాణుల రక్షణకు
- స్పెషల్ కేర్ తీసుకుంటున్న జూ అధికారులు
- బయట సేదతీరే జంతువులకు గడ్డితో చలువ పందిళ్లు
- చల్లని ఏర్పాట్లతో మూగజీవాలకు ఊరట
వరంగల్, వెలుగు: ఎండలు మండుతుండగా.. వరంగల్ కాకతీయ జూ పార్కు అధికారులు వన్యమృగాలు, పక్షుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. వేడి నుంచి సేద తీరేందుకు పెద్ద పులులకు కూలర్లు పెట్టారు. చిరుతలకు ఎన్‍క్లోజర్‍పైన స్ర్పింకర్లు ఏర్పాటు చేశారు. గుడ్డేలుగులు, ఆస్ట్రిచ్ పక్షులు, జింకలు, అడవి దున్నలు, దుప్పులకు చల్లగా ఉండేలా పందిళ్లు వేశారు. ఎన్‍క్లోజర్, బోను లోపలి భాగాల్లోని నెమళ్లు, రామ చిలుకలు, ఇతర పక్షులకు వేడి నుంచి ఉపశమనం కలిగించేలా ఏర్పాట్లు చేశారు. కేర్‍టేకర్లు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జూపార్క్ కాగా.. సమ్మర్ లో సందర్శించే టూరిస్టులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేశారు. జూలో పెద్ద పులులు, చిరుత పులులు, అడవి దున్నలు, మనుబోతు, కొండ గొర్రెలు, ఆస్ట్రిచ్, కృష్ట జింకలతో పాటు మొసళ్లు, నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి.
నెమళ్లు, హంసలు, లవ్‍బర్డ్స్ అలరిస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఉష్టోగ్రతలు పెరిగిపోతుండగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంటి ఎన్‍క్లోజర్లు దాటి బయటకు రావట్లేదు. బయట తిరిగే జింకలు, దుప్పులు నీడ కోసం వెతుకుతున్నాయి. నెమళ్లు, రామ చిలుకలు, వివిధ రకాల పక్షి జాతులు తల్లడిల్లుతుండగా తగు రక్షణ చర్యలను జూ అధికారులు కల్పించారు. అడవి దున్నలు, దుప్పులు, జింకలకు ఉపశమనం కోసం గడ్డి, తుంగ, తాటి కమ్మలతో కూడిన పందిళ్లతో పాటు పలుచోట్ల గ్రీన్ మ్యాట్ కట్టారు. ఆస్ట్రిచ్ పక్షులను కుళాయి పైపులతో ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. నెమళ్లు, రామచిలుకల వంటి పక్షులు ఉండే బోన్ల చుట్టూరా పచ్చని కార్పెట్లు, గన్నీ సంచులు, పీచు తడకలు అమర్చారు. ఎప్పటికప్పుడు వాటిని నీటితో తడపడం ద్వారా చల్లగా ఉండేలా చూస్తున్నారు.
పక్షులకు పండ్లు, ఓఆర్‍ఎస్ పౌడర్లు
జంతువులు, పక్షులు బయట తిరిగే సమయాల్లో ఎండ ప్రభావం నుంచి తట్టుకునేలా ఏర్పాట్లు చేసిన అధికారులు సమ్మర్ నేపథ్యంలో వీటి మెనూలోనూ పలు మార్పులు చేశారు. పెద్ద పులులు, చిరుతల శరీరంలో నీటి శాతం తగ్గకుండా వెటర్నటీ డాక్టర్ల పర్యవేక్షణలో ఓఆర్‍ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్లు అందిస్తున్నారు. ఆస్ట్రిచ్‍లకు ఆకు కూరలు, పండ్లు..అడవి దున్నలు, కృష్ణ జింకలు, దుప్పులకు అందుబాటులో నీరు ఉంచడానికి తోడు మినరల్స్ కోసం నాలుకతో చప్పరించేలా చెట్లకు సాల్ట్ లిక్స్(ఉప్పు గడ్డలు) నోటికి అందేలా తాళ్లతో కట్టారు. తద్వారా వాటి ఒంట్లోకి సోడియం వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఎలుగుబంట్లకు పుచ్చకాయలు, తర్పూజ అందిస్తున్నారు. రామ చిలుకలు, నెమళ్లు, రంగుల కోళ్లు, పావురాలు, రంగురంగుల పిట్టల వంటి పక్షి జాతులకు మంచినీటిలో గ్లూకోజ్ పౌడర్ కలిపి ఇస్తున్నారు. పులులు, చిరుతలు, గుడ్డేలుగు వంటి వేటాడే జంతులను కేర్‍టేకర్లు సమ్మర్ ఎఫెక్ట్ నుంచి కాపాడుతున్నారు.