
- కరీంనగర్ బల్దియా సెక్షన్ ఉద్యోగి సస్పెన్షన్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తొమ్మిది మంది ఎన్ఎంఆర్ ల సర్వీస్ రెగ్యులరైజేషన్ కు రూ.2 లక్షలు వసూలు చేసిన బల్దియా వార్డు ఆఫీసర్ శంకర్ బాబు పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అతడు సస్పెన్షన్ కాలంలో పర్మిషన్ లేకుండా శంకర్ కరీంనగర్ వదిలి వెళ్లొద్దని ఆదేశాల్లో స్పష్టంచేశారు.
కమిషనర్ పై కోర్టులో కేసు వేయించి..
కార్పొరేషన్ లో ఎన్ఎంఆర్ లుగా పని చేస్తున్న సీహెచ్ దానయ్యతోపాటు మరో తొమ్మిది మంది తమ సర్వీస్ ను రెగ్యులరైజ్ చేయాలని కొన్నేండ్లుగా కోరుతున్నారు. వారి రెగ్యులరైజ్ చేయడానికి, వార్డు ఆఫీసర్ శంకర్ బాబు రూ.2 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నాడు. అయితే పని పూర్తికాక పోవడంతో కమిషనర్‌పై కోర్టులో కేసు వేయండని ఎన్ఎంఆర్ లను ఆయన ప్రోత్సహించాడు. కోర్టు నుంచి ఆదేశాలు రాగానే పని పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం వారికి ఎలాంటి సాయం చేయకపోవడంతో శంకర్ బాబుపై ఎన్ఎంఆర్ లు ఈనెల 4న కమిషనర్ కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. శంకర్ బాబు అవినీతికి పాల్పడినట్టు నిజమేనని నిర్ధారణ అయింది.
ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్
శంకర్ బాబు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందినట్లు ఈనెల 6న ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మరో ఫిర్యాదు చేశాడు. వి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లతో బల్దియాలో కారుణ్య నియామకం పొందేందుకు శంకర్ బాబు సహకరించాడని అందులో పేర్కొన్నాడు. ఎన్ఎంఆర్ ల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందడం, మరొకరికి సహకరించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.