జల జగడాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి

  • అఖిలపక్ష సమావేశంలో సీమ నేతల ఏకగ్రీవ తీర్మాణం
  • రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, మేధావుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్య బద్దంగా పరిష్కరించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తే అన్ని ప్రాంతాల వారు సమాన హక్కులతో జీవించే సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని.. ఆరోపణలు, విమర్శల వల్ల సమస్య పక్కదారి పట్ట ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు - ప్రజాస్వామిక పరిష్కారం అనే అంశం పై కర్నూలు పార్లమెంటరీ నియోజక వర్గ రాజకీయ పార్టీలు ప్రజా విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలు నగరంలోని డా" బ్రహ్మ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. 
రాయలసీమ విద్యా వంతుల వేదిక కన్వీనర్ అరుణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, సీపీఎం జిల్లా నాయకులు గౌస్ దేశాయ్,  బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి, జనసేన ప్రతినిధులు అర్షద్, పగడాల కోదండ, సమాచార హక్కు చట్టం ఐక్య వేదిక రామ కృష్ణా రెడ్డి, ఉపాధ్యాయ వర్గం తరపున డీటీఎఫ్ నాయకులు రత్నం ఏసేపు,రాయలసీమ విద్యావంతుల వేదిక కో-కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ రవిప్రకాశ్, హెచ్ డబ్ల్యూఓ (HWO) శ్రీనివాసులు, నాగ భూషణం, రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి కన్వీనర్ ఎం మోహన్, ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి అధ్యక్షుడు కె రవికుమార్, యువజన పోరాట సమితి అధ్యక్షుడు వీవీ నాయుడు, రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు సీమ కృష్ణ, రాయలసీమ రైతు సంఘాల నాయకులు ఉద్యమ కారులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతోందని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాయలసీమను పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి సంవత్సరం వందల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రం పాలవుతోందని, రాయలసీమలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తికావడం లేదన్నారు. నికర జలాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి రాయలసీమలో లేదన్నారు. ప్రజా ఉద్యమాలను, రైతు ఉద్యమాలను తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం వుందన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు, రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా ఉద్యమాలను నిర్మించాలని పిలుపు నిచ్చారు. వక్తల సూచనల మేరకు సమావేశంలో క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
  • రాయలసీమకు శాపంగా మారిన జీవో నెంబర్ 69 ని తక్షణమే రద్దు చేయాలి.
  • రాయలసీమ కు కేటాయించిన నిఖర జలాలను వాడుకోవడానికి వీలుగా వేదవతి ప్రాజెక్టును, తుంగభద్ర నదిపై ఆర్డీఎస్   కుడి కాలువ నిర్మాణాన్ని చేపట్టాలి.
  • వృథాగా సముద్రంలో కలిసి పోతున్న నీటిని క్యారీ ఓవర్ గా నిల్వ చేసుకోవడానికి వీలుగా శ్రీశైలం డ్యాంకు ఎగువన రాయలసీమ-తెలంగాణ మధ్య రాకపోకలకు వీలు కల్పించే బహుళార్ధ సాధక సిద్దేశ్వరo అలుగు నిర్మాణాన్నివెంటనే చేపట్టి పూర్తి చేయాలి. అలాగే తుంగభద్ర నదిపై కర్నూలు-గద్వాల జిల్లాల మధ్య అనుసంధానంలా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి.
  • రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన హంద్రీ-నీవా, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించి అనుమతి పొందిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలి. దానికోసం విభజనకు ముందే చేపట్టిన దమ్ముగూడెం ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ నీటిని పై ప్రాజెక్టులకు కేటాయించాలి.