కామారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు

కామారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని బోర్లలో నీటి ధార క్రమంగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత, పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు మరింత కిందకు పడిపోతున్నాయి. ఈ కారణంగా బోర్లలో సరిపడా నీరు రాకపోవడంతో యాసంగిలో వేసిన వరి పొలాలు ఎండిపోయే ప్రమాదం నెలకొంది.

ఫిబ్రవరిలో సగటు నీటి మట్టం 12.97 మీటర్లు

ఫిబ్రవరి నెలలో జిల్లాలో సగటు నీటి మట్టం 12.97 మీటర్లుగా నమోదయ్యింది.  గత నెల జనవరిలో 10.38  మీటర్లుగా లోతులో నీళ్లు ఉండగా.. ఒక నెల వ్యవధిలో 2.59 మీటర్ల నీటి మట్టాలు తగ్గాయి.  ఎండల తీవ్రత మరింత పెరిగితే, భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉంది.  జిల్లాలో 8 మండలాల్లో భూగర్భ జలాలు అత్యధిక లోతుల్లోకి వెళ్లాయి.  దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, కామారెడ్డి, గాంధారి, రాజంపేట, నిజాంసాగర్, లింగంపేట మండలాల్లో నీటి మట్టాలు 15 నుంచి  20 మీటర్ల లోతుకు తగ్గాయి.  

బీర్కూర్, జుక్కల్, బాన్సువాడ, రామారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, ఎల్లారెడ్డి, పాల్వంచ, డొంగ్లి ప్రాంతాల్లో 15 మీటర్ల లోతులో నీళ్లున్నాయి.  అత్యధికంగా పిట్లం మండలంలోని గోద్మెగావ్ గ్రామంలో 35.62 మీటర్ల లోతులో భూగర్భ జలాలు పడిపోయాయి.- భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లోని గ్రామాల్లో కొన్ని బోర్లలో నీళ్లు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో కూడా బోర్లలో నీటి స్థాయి తగ్గిపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది.

వరి పంటకు నీటి వినియోగం పెరుగుతోంది

ప్రస్తుతం జిల్లాలో 2. 60 లక్షల  ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.  అందులో 1,60,000 ఎకరాలు బోర్లకింద సాగవుతున్నాయి. ఈ వరి పంట ప్రస్తుతం కీలక దశలో ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వరి సాగుకు అధికంగా నీటి అవసరం ఉంటుంది. ఇప్పుడే బోర్లలో నీటి ధార తగ్గడం వల్ల వరికి సరిపడా నీరు అందుతుందో లేదో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.  

నియంత్రణ అవసరం

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, నీటిని ఆదా చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి సతీశ్  సూచించారు. రాబోయే రోజుల్లో  నీటి సమస్య నుంచి బయటపడేందుకు జాత్రగ్తగా వ్యవహరించాలి. 

సతీశ్,  జిల్లా భూగర్భ జల అధికారి