- గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటి సప్లై బంద్
- చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన
- మిగిలిన నీళ్లు తాగునీటి అవసరాలకే వాడాలని అధికారుల ఆదేశాలు
మంచిర్యాల, వెలుగు : ఎండలు ముదురుతున్న కొద్దీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ లెవల్స్ పడిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్‌తో జలాశయంలోని నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్ పంపింగ్ నిలిచిపోడంతో ఈ ప్రాజెక్టుకు నీటి కటకట ఎదురైంది. గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటి సప్లై బంద్ కాగా, చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలు. అయితే, బుధవారం నాటికి నీటిమట్టం7.664 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్‌కు 308 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు సప్లై చేస్తున్నారు. అలాగే, మిషన్ భగీరథ స్కీమ్ కోసం మంచిర్యాల గ్రిడ్‌కు 23 క్యూసెక్కులు, రామగుండం గ్రిడ్‌కు 58 క్యూసెక్కులు ఇస్తున్నారు.
ఇప్పటికే మంచిర్యాల గ్రిడ్‌కు నీటి కొరత మొదలైంది. ప్రాజెక్టులోని ఇన్‌టేక్ వెల్ దగ్గర వాటర్ లెవల్స్ పూర్తిగా తగ్గడంతో చిన్నపాటి కాలువ తీసి నీళ్లందిస్తున్నారు. అవసరమైతే గోదావరి మధ్యలో ఇన్‌టేక్ వెల్ తవ్వి భగీరథకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రెండు నెలల్లో వాటర్ లెవల్స్ మరింత పడిపోయి మే నాటికి 3 టీఎంసీల డెడ్ స్టోరేజీకి చేరుకునే అవకాశం ఉన్నది. దీంతో మిగిలిన నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని ప్రాజెక్టు అధికారులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎల్లంపల్లిపై కాళేశ్వరం ఎఫెక్ట్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజీ తెలంగాణకు వాటర్ హబ్‌గా మారింది. ఇక్కడినుంచే మిడ్ మానేరు మొదలు మల్లన్నసాగర్ వరకు రివర్స్ పంపింగ్ జరిగేది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్ పంపింగ్ నిలిచిపోయింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం నీటి కటకట ఎదురైంది. గోదావరికి ఎగువ ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా బంద్ అయ్యింది. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లిలో 20 టీఎంసీల గరిష్ట సామర్థ్యం మెయింటెయిన్చేశారు. ఈ ఏడాది రివర్స్ పంపింగ్ చేసే అవకాశం లేదు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని, ఈ ఎండాకాలం గడవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు.
గూడెం లిఫ్ట్ కింద ఎండుతున్న పంటలు
కడెం ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్ చేసి దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్మండలాల్లోని 30 వేల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. ప్రాజెక్టులో 18 టీఎంసీలు ఉంటేనే లిఫ్ట్‌లు నడపాలనే ఆదేశాలున్నాయి.
ఈ ఏడాది డిసెంబర్లో వాటర్ లెవల్స్ అంతకంటే తగ్గడంతో ఆందోళన మొదలైంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఉన్నతాధికారులపై ఒత్తిడి తేగా, యాసంగి సీజన్లో15వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీళ్లు ఇస్తామన్నారు. ఈ మేరకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వాటర్ సప్లై చేసి, రెండు రోజుల కిందట లిఫ్ట్ బంద్ చేశారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నది. ఈ సమయంలో లిఫ్ట్ బంద్ కావడంతో పొలాలు ఎండుతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు మరో తడిని అందించాలని కోరుతున్నారు.