ఎండాకాలం..నీటి కరువు రాకుండా చూడాలి

ఎండాకాలం..నీటి కరువు రాకుండా చూడాలి

సముద్ర మట్టం (సీ లెవెల్) నుంచి తెలంగాణ పీఠభూమి ఎత్తు 536 మీటర్లు.   ఈ విషయాన్ని  గ్రహించిన నాటి కాకతీయ పాలకులు వర్షాల ద్వారా వచ్చే నీటిని ఒడిసి పట్టుకునేలా ఒక్కో గ్రామానికి తలపైన చెరువుచుట్టూ కుంటలు తవ్వారు.  ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో  చెరువులోకి నీరు వెళ్లేలా గొలుసు కట్టలు కూడా నిర్మించారు. తూర్పు, ఉత్తరాన గోదావరి,  దక్షిణాన కృష్ణా నదులు ప్రవహిస్తున్నా,  లక్షల కోట్లు ఖర్చుపెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్మించుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణకు కరువు పరిస్థితులు తప్పలేదు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలంగాణలో  కరువును  పారదోలడానికి తీసుకున్న చర్యలు  నామమాత్రమే.  ఒకవైపు గోదావరి,  కృష్ణా  ప్రవహిస్తున్నా నీటిని ఎత్తలేని ప్రభుత్వాలు,  ఇంకోవైపు వర్షాలు లేక కక్షకట్టిన ప్రకృతి. చంద్రబాబు టీడీపీ పాలనలో ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపించినా వైఎస్ఆర్  కాంగ్రెస్ పాలనలో ప్రకృతి కనికరిస్తే జలయజ్ఞానికి పునాదులు పడ్డాయి.

 మేడిగడ్డ పిల్లర్లు కూలిన ఫలితం

 తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో చేపట్టిన పథకాలు రైతులకు నామమాత్రంగా ఉపశమనాన్ని ఇచ్చాయి.  వర్షాలు బాగా ఉపయోగపడ్డాయి. జలయజ్ఞంలో మరుగున పడ్డ ప్రాజెక్టుల దుమ్ము దులిపి రీ డిజైన్ చేసి లిఫ్టింగ్ ఎ రివర్  కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మాణం అయ్యాయి.  

ప్రకృతి కనికరించి అధిక వర్షాల వల్ల  గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు వచ్చి తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి.   కాళేశ్వరం ప్రచారానికి తగ్గ నీళ్లు అందించలేకపోయినా.. ఆమాత్రం అందే నీళ్లు కూడా  మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కుంగిపోవడంతో 2022– 23లో అత్యధిక వర్షపాతం ఉన్నా నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితితో గోదావరి నీళ్లన్నీ బంగాళాఖాతంలో కలిశాయి.

ఆమాత్రం అందించే కాళేశ్వరం నీళ్లు కూడా..తుమ్మిడిహెట్టి వద్ద  ముప్పైవేల కోట్లతో  నిర్మించాల్సిన  ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో లక్ష కోట్లకు పెంచి నాసిరకం  ప్రాజెక్టు నిర్మించారు అని,   భూకంప పరిధిలో 50 టీఎంసీల మల్లన్న సాగర్ నిర్మించారనే ఆరోపణలపై.. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్  ఆధ్వర్యంలో విచారణ కమిషన్  ఏర్పాటు చేసింది.  

విచారణలో  భాగంగా  మేడిగడ్డ  ప్రాజెక్ట్  కుంగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి  కేంద్ర ప్రభుత్వం  నేషనల్  డ్యామ్ సేఫ్టీ  అథారిటీ  ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు.  కమిషన్   విచారణ  ఇంకా కొనసాగుతున్నది.  నిపుణుల కమిటీ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం అని చెప్పి ఖాళీ చేయమని ఏడాది గడిచినా రిపోర్ట్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లాన్ ప్రకారం నిర్మాణంలో నాణ్యత లేదు.   

టైం బాండ్, అధిక నీటిని నిల్వ చేయడం వల్లనే డ్యామేజ్ అని పత్రికలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రచురించాయి.  2024  సంవత్సరంలో  కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు  ఎత్తిపోయకున్నా  ప్రాజెక్టులు ఎల్లంపల్లి  దేవాదుల తదితర ప్రాజెక్టులవల్ల రికార్డు స్థాయిలో పంట పండిన మాట నిజమే. కానీ,  ప్రస్తుతం ప్రాజెక్టులో  నీళ్లకు బదులు ఇసుకే మిగిలింది. ఆ  ఇసుకను  ప్రభుత్వం తొలగిస్తున్నది.

గోదావరి నీళ్లన్నీ బంగాళాఖాతంలోకి...

వాస్తవానికి  గత  సంవత్సరం మోస్తరు వర్షాలు పడ్డా నీటిని నిల్వ చేసుకొని ఎత్తలేని పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టుది.  ఫలితంగా గోదావరి నీళ్లన్నీ బంగాళాఖాతంలో కలిశాయి.  వర్షాలు పెద్దగా పడకపోవడం వల్ల చెరువులు,  కుంటలలో  కూడా పెద్దగా వర్షపు నీరు నిల్వ కాలేదు.  ఫిబ్రవరిలోనే  ఎండాకాలంలా  ఉష్ణోగ్రతలు ఉన్నాయి.  

ఒకవైపు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి.  గ్రౌండ్ వాటర్ లేక బోర్లు ఎండిపోతున్నాయి.    ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్ట్ పైనే కాళేశ్వరం  ప్రాజెక్టు భవిష్యత్ ఆధారపడి ఉన్నది. ఆ రిపోర్ట్  ఆధారంగానే  రాష్ట్ర ప్రభుత్వం  రిపేర్లు  చేపట్టే అవకాశం ఉన్నది.  

గత ప్రభుత్వ  పాలకులకు ఏటీఎం అయింది అని కేంద్ర ప్రభుత్వ నాయకుల వ్యాఖ్యలు తప్ప ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలు త్వరగా రిపోర్ట్ ఇవ్వడం లేదు.  ఇంకోవైపు  నిర్మాణ  కంపెనీ మేడిగడ్డలోని  ఏడో  బ్లాక్  మొత్తం నిర్మించాల్సిందే అని  కమిషన్ విచారణలో  చెప్పింది.  

ఇంకోవైపు ఎండాకాలం  కరువు  సంభవిస్తున్నది.  ప్రాజెక్ట్ కుంగడానికి అసలు కారణం ఏంటి? ఎవరు? అనే విషయం తేల్చాలి.  అక్రమార్కులను  శిక్షించి వారివద్ద నుంచే  ఖర్చులను  వసూలు చేసి ప్రాజెక్ట్  రిపేర్లు చేయించి  నీళ్లు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

ఇటు గోదావరి,  అటు కృష్ణానదీ జలాలు తెలంగాణకు సరిపడ నీళ్లు  రావడం లేదు. ఈ ఎండాకాలం నీటి కొరత నుంచి తెలంగాణను కాపాడడానికి ఏంచేయాలో యుద్ధప్రాతిపదికన  ప్రభుత్వం సీరియస్​గా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. తాగునీటి,  సాగు నీటి పొదుపుపై తక్షణం దృష్టిపెట్టాలి.

కృష్ణా నీళ్లు అందని పరిస్థితి

ఈ ఏడాది మిగిలిన కాలంలో  కేఆర్​ఎంబీ తెలంగాణకు నీటి వాడకానికి బాగానే కేటాయించింది. కానీ,  శ్రీశైలంలో నీరు డెడ్​స్టోరేజీకి చేరిన దశలో ఎన్ని టీఎంసీల నీరు కేటాయించినా  ప్రయోజనం ఏమిటి?  
కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు పనితీరు ఏమీ బాగాలేదు. ఏడాది పొడవునా కేటాయింపునకు మించి  నీళ్లు దోచుకుపోతుంటే కేఆర్​ఎంబీ కళ్లు మూసుకుందా? ఈ సమయంలో తెలంగాణకు నీళ్లు కేటాయిస్తే అర్థం ఉందా?  
ఈ ఎండాకాలం కృష్ణా నుంచి కూడా తెలంగాణ సాగుకు, తాగునీటికి కటకట తప్పేటట్టు లేదు.

- బందెల సురేందర్ రెడ్డి-