
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరయ్యారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. సమావేశం తర్వాత మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మతం అడిగి టూరిస్టులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కశ్మీరీలపై, కశ్మీరీ స్టూడెంట్స్ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరారు.
బైసరన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు మోహరించలేదని ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మారణ హోమానికి తెగబడుతుంటే క్విక్ రియాక్షన్ టీమ్ ఎక్కడికి వెళ్లిందని, వారికి గంట సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. భద్రతా బలగాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి పాల్పడుతున్న గ్రూపులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ న్యాయసూత్రాలు కూడా ఆత్మరక్షణలో భాగంగా ఎయిర్, నావల్ దాడులు చేసేందుకు అనుమతిస్తున్నాయని గుర్తుచేశారు. పాకిస్తాన్ కు ఆయుధాలు అమ్మకుండా ప్రపంచం నిబంధనలు విధించాలని డిమాండ్ చేశారు.
సింధూ జలాలను ఆపితే ఆ నీళ్లను ఎక్కడ దాచుకుంటాం..?
పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంపూర్ణ మద్ధతిస్తామని ఒవైసీ చెప్పారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్రం ప్రకటించిందని, కానీ ఆ నీళ్లను ఎక్కడ స్టోర్ చేస్తామని అన్నారు. ఏదైతేనేం.. కేంద్ర నిర్ణయానికి మద్ధతిస్తామని చెప్పారు.
ముస్లింలు ప్రార్థనల్లో నల్ల బ్యాడ్జీలు ధరించాలి..
కశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన మారణహోమానికి నిరసనగా ముస్లింలు శుక్రవారం (ఏప్రిల్ 25) ప్రార్థనల సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించాలని పిలుపునిచ్చారు ఒవైసీ. ఉగ్రవాదుల చర్యలను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. బాధితుల పక్షాన దేశం నిలవాల్సిన సమయం ఇది అని ఓవైసీ పిలుపునిచ్చారు.