- మండే ఎండల్లోనూ ఉబికి వస్తున్న జలం
- ఆదివాసీలకు అమృతధార
భద్రాచలం, వెలుగు : చర్ల మండల కేంద్రం నుంచి పూసుగుప్పకు వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ గ్రామం వెంకటచెరువులో ఆదివాసీల అమృతధార అందరినీ ఆకర్షిస్తోంది. భూగర్భ జలాలు పడిపోతున్న మండే ఎండల్లోనూ ఉబికి వస్తున్న జలం ఆదివాసీల దాహార్తిని తీర్చుతోంది. నట్టడవిలో ఈ ఊటబావి ఆదివాసీలకు అమృతధారగా మారింది. ఆ గ్రామంలో కరెంట్, మిషన్‌భగీరథ వాటర్‌ట్యాంకు, బోరు అన్నీ సదుపాయాలు ఉన్నాయి. అయినా తమ ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో
నట్టడవిలో ఉన్న ఈ ఊటబావి నుంచే తాగునీటిని తీసుకెళ్తారు. ఏడాది పొడవునా నిత్యం నీరు పైకి ఉబికి వస్తుంది. 30 ఏండ్ల కింద ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాగునీటి కోసం అడవిలోని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊటబావిని వారు గుర్తించారు. ఎక్కడి నుంచి నీరు వస్తుందో తెలియదు. కానీ పైకి నీరు పొంగుతోంది. సిమెంట్రింగులు తీసుకొచ్చి ఆ చెలిమలో ఏర్పాటు చేసుకున్నారు.
తియ్యగా, చల్లగా ఉండే ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకెళ్తుంటామని ఆదివాసీ మహిళలు పద్దం రాధ, సోడె ద్రౌపతి, పద్దం జ్యోతి తెలిపారు. గ్రామస్తులకే కాదు.. ఆ అడవిలో ఉండే జంతువులు, పక్షులకు దాహార్తిని తీర్చుతున్న ఈ ఊటబావి అద్భుతం.