ఎవడీ పిల్లోడు.. ఎందుకిలా : ఎగురుతున్న జాతీయ జెండాను పీకి పారేశాడు

ఎవడీ పిల్లోడు.. ఎందుకిలా : ఎగురుతున్న జాతీయ జెండాను పీకి పారేశాడు

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే జాతీయ జెండాకు అవమానం జరిగింది.  త్రివర్ణ పతాకాన్ని  నేలపై విసిరేసిన  సంఘటన దేశ ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఓ పిల్లోడు జాతీయ జెండాను అవమానించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిల్లగాడికి మువ్వన్నెల జెండాపై ఎందుకంత కోపం వచ్చింది. ఎందుకు జాతీయ జెండాను విసిరేయాల్సి వచ్చింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం.

25 సెకన్ల వీడియోలో  ఓ పిల్లాడు జాతీయ జెండాను అవమానించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో ఆ బాలుడు కోపంతో  భవనంపైకి ఎక్కాడు. ముందుగా భవనంపైన ఉన్న కాషాయజెండాను నేలకేసి కొట్టాడు. అనంతరం ఓ బ్యానర్ను చించేసి నేలపై పడేశాడు. ఆ తర్వాత భవనంపై భాగంలోకి ఎక్కిన పిల్లాడు...రెపరెపలాడుతున్న జాతీయ జెండాను తీసేసి కిందకు విసిరేశాడు. ఈ జెండా కింద ఉన్న ఇసుకపై పడింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బసిర్ హత్లో చోటు చేసుకుంది.  పోలీసులు, స్థానికుల సమక్షంలోనే ఈ దిగ్ర్భాంతికరమైన ఘటన జరగడం గమనార్హం. 

ఈ ఘటనపై బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. పశ్చిమబెంగాల్లో జాతీయ జెండాకు అవమానం జరిగినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని చెప్పారు. జాతీయ జెండాను అగౌరవ పర్చడం బాధగా ఉందన్నారు. జాతీయ జెండాను అవమానించిన ఆ పిల్లాడిని పట్టుకుని శిక్షించాలని  పశ్చిమబెంగాల్ డీజీపీతో పాటు..ఘటన జరిగిన బసిర్ హట్  జిల్లా ఎస్పీ, జిల్లామేజిస్ట్రేట్ను కోరుతున్నట్లు పేర్కొన్నారు. 

జాతీయ జెండాను అవమానిస్తే శిక్ష పడుతుందా?

జాతీయ జెండాను అవమానిస్తే లేదా అగౌరవ పరిస్తే జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971 సెక్షన్ 2 ప్రకారం శిక్షార్హులు. దీని ప్రకారం ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రజల సమక్షంలో లేదా మరో ఇతర ప్రదేశాల్లో అయినా జాతీయ జెండాను కాల్చడం, జెండాతో వికృత చేష్టలు చేయడం, జెండాను నాశనం చేయడం, తొక్కడం, జాతీయ జెండాను అవమానించేలా మాట్లాడినా..రాసినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఒక్కోసారి జైలు శిక్ష, జరిమానా రెండూ విధిస్తారు.