
బషీర్‌బాగ్, వెలుగు: వెస్ట్ బెంగాల్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ నొటోరియస్ చీటర్ పలాష్ పాల్‌ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 ఏండ్ల కిందట పలాష్ హైదరాబాద్‌కు వచ్చి, కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్ టార్గెట్‌గా మోసాలు చేస్తున్నాడు. నారాయణగూడ పీఎస్ లో సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఇంటీరియర్ డిజైనర్ అంటూ కన్స్ట్రక్షన్ ఓనర్స్ కు తొలుత పలాష్ పరిచయమై, వర్క్ చేస్తానని అందినకాడికి డబ్బులు వసూలు చేసేవాడు.
డబ్బులు చేతిలో పడ్డాక ఓనర్స్ కాల్స్ కు స్పందించేవాడు కాదు. కార్పెంటర్, వుడ్ వర్క్స్ కోసం రూ.66 లక్షలు తీసుకున్నాక ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో నారాయణగూడకు చెందిన బాధితుడు నికిత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, పలాష్నుఅరెస్ట్ చేశారు.
అతడి బ్యాంక్ అకౌంట్లోని రూ.18.65 లక్షలను ఫ్రీజ్ చేసి, 120 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు, పలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడిపై 2021లో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో మర్డర్ కేసు, నారాయణ గూడ, శంషాబాద్, రాయదుర్గం పోలీసు స్టేషన్ లలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. మర్డర్ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో అతడిపై ఎన్ బీడబ్ల్యూ వారెంట్ ఇష్యూ అయ్యిందని డీసీపీ తెలిపారు.