దళితులకు ఇచ్చిన హామీలు ఏవి?

దళితులకు ఇచ్చిన హామీలు ఏవి?

రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల అనంతరం  125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్14న ఆవిష్కరించుకున్నారు. ఇదే సందర్భంలో  కొత్త రాజ్యాంగం కావాలన్న నోటితోనే జైభీమ్​ నినాదం పలకాల్సిన కాడికి తెలంగాణ సమాజం తీసుకొచ్చింది. నేడు తెలంగాణ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు.ఈ ఆవిష్కరణలను తెలంగాణ సమాజం గౌరవంగా భావిస్తూ స్వాగతిస్తున్నది. అంబేద్కర్  బతికున్నప్పుడే 1950లోనే మహారాష్ట్రలో అక్కడి ప్రజలు వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇక్కడి ప్రజలు రూపాయి రూపాయి వేసుకొని చెమట చుక్కలతో పట్టణ ప్రాంతం నుంచి పల్లె పల్లెలో తమ సొంత నిధులతో అసంఖ్యాకంగా బుద్ధుడి విగ్రహాలు మించిపోయే తరహాలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేసుకొని, గ్రంధాలయాలకు, కమ్యూనిటి హల్స్ కు, కాలనీలకు అంబేద్కర్ పేరు పెట్టుకొని  తమ ఆత్మ గౌరవ పతాకగా ఎగరవేసుకుంటున్నారు. 

దళితులకు ఇచ్చిన హామీలు ఏవి?

స్వరాష్టానికి తొలి దళిత సీఎం హామీ నుంచి మొదలై  దళితులకు   కేటాయించిన నిధులు దారి మళ్లింపు వరకు  దళితులకు దగాలు తప్ప ఏమైనా జరిగిందా?  తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు18 శాతం పైబడి ఉన్నారు. ఎస్సీలకు అభివృద్ధిలోను, సంక్షేమంలోను, రాజకీయ పదవులలోను18% కేటాయించాలి కదా.  కానీ  రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సగం నిధులు పక్కదారి పట్టినట్లు ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ మానిటరింగ్ కమిటీయే గుర్తించింది. సెల్ఫ్ ఎంప్లాయ్​మెంట్ స్కీమ్ లో భాగంగా  యువత సొంతంగా అభివృద్ధి చెందడానికి యంత్రాలు, వాహనాలు ఇతరత్రా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్లు ఇచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చినంక వేలాదిమంది  యువత లోన్ల కోసం ఏండ్ల తరబడి వేచిచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిర్వీర్యం అయింది. దళితులకు మూడెకరాల భూమి అటకెక్కింది,పోడు భూముల పేరుతో ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలేదు. ఇక్కడ కూడా మతం పేరుతో యజ్ఞాలు, యాగాల పేరుతో పునరుద్ధరణ వాదం బయలుదేరింది. చట్టబద్ధ పాలన కనుమరుగైంది. ఇవన్నీ రాజ్యాంగ సారాన్ని పాలకులు గ్రహించక పోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు కావు. ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తున్నవే. 

నామకరణాలతో అణిచివేతలు ఆగేనా?

మరియమ్మ లాకప్ డెత్ పరిస్థితి ఏమిటి? అక్రమ ఇసుక దందాకు అడ్డు తగిలిన నేరెళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది మీరు కాదా! ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మద్దతు ధర అడిగినందుకు బేడీ లేసి జైలుకు పంపింది నిజం కాదా! చటాన్ పల్లిలో నలుగురు యువకులను కాల్చి చంపి ఈ ప్రభుత్వం హక్కుల ఉల్లంఘనకు పాల్పడలేదా! తెలంగాణలో నిరుద్యోగం, నిరుద్యోగ ఆత్మహత్యలు ఏ అభివృద్ధికి నిదర్శనం? ప్రభుత్వ విద్యకు పాడెగడుతూ ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించడం దళితులను బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేయడం కాదా?  రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ బడులు మూసివేయడం దేనికి నిదర్శనం? కులాల పేరుతో గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయడం కుల వివక్ష కాదా? మహిళలకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో కల్పిస్తున్న సమాన అవకాశాలు ఏవి? డిజిటలైజేషన్ ధరణి పేరుతో 'ప్రభుత్వ భూములు' భూస్వాములు ఆధిపత్య వర్గాలు స్వాధీనం చేసుకుంటున్నది వాస్తవం కాదా? తెలంగాణ సంపదను మెగా క్రిష్ణారెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లకు ధారపోస్తున్నది మీరు కాదా? దళితులు, బడుగులకు దక్కాల్సిన భూములను అధికార బలంతో ఆధిపత్య వర్గాలు లాక్కుంటున్నది నిజం కాదా? స్మశాన వాటికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకుంటున్న సంగతేంది? ఇన్ని గాయాలైన గుండెలపై  ఒక నామకరణం, ఒక ఆవిష్కరణ చేసి ఇదే అంబేద్కర్ ఆశయం అనడం సమంజసమా? భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండాలి. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను, ఫలాలను రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కినప్పుడే సామాజిక న్యాయం పరిఢవిల్లుతుంది. అవి అందించకుండా విగ్రహవిష్కరణలతో, నామకరణాలతో సరిపుచ్చుతారా?. 

  • పందుల సైదులు,

తెలంగాణవిదాయ్వంతుల వేదిక