Health Alert : వానా కాలంలో ఎలాంటి జ్వరాలు వస్తాయి.. వాటి లక్షణాలు ఏంటీ..?

Health Alert : వానా కాలంలో ఎలాంటి జ్వరాలు వస్తాయి.. వాటి లక్షణాలు ఏంటీ..?

వాతావరణ మార్పుల వల్లో ఏమో తెలీదుగానీ ఈ మధ్య చాలామందికి ఉన్నట్టుండి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వచ్చింది మామూలు జ్వరమైతే పర్వాలేదుగానీ, ఒకవేళ అది వైరల్ ఫీవర్ అయ్యి, దాన్ని గుర్తించకపోతే.. ప్రమాదంగా మారొచ్చు. అందుకే ఇప్పుడొచ్చే జ్వరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వాతావరణంలో మార్పులు రాగానే వైరల్ వ్యాధులు వ్యాపించే అవకాశం పెరుగుతుంది. ఈ వానాకాలం సీజన్ లో తరచూ వచ్చే జలుబు, ఫ్లూ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా లాంటి సమస్యలూ వస్తాయి. అందుకే ఏది ఎలాంటి జ్వరమో గుర్తించాలి. లక్షణాలను బట్టి వచ్చిన సమస్య ఏదై ఉండొచ్చు? ఎలాంటి లక్షణాలు కనబడితే ఎలాంటి జ్వరం అన్న విషయం తెలుసుకోవాలి.

వైరల్ జ్వరాలు

కొన్ని వైరల్ జ్వరాలు ముందుగా జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే వచ్చేస్తాయి. వీటిలో వాటంతట అవే తగ్గిపోయే వైరల్ జ్వరాలు కూడా ఉండొచ్చు. కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సిన జ్వరాలూ ఉండొచ్చు. అందుకే జ్వరం రాగానే భయపడాల్సిన పని లేదుగానీ, ప్రతి జ్వరాన్నీ 'నార్మల్ ఫీవర్' అని కొట్టిపారెయ్యకుండా ఉండాలి.

లక్షణాలను బట్టి..

వైరల్ జ్వరాలు ఒక్కసారిగా వచ్చి తీవ్రంగా పెరుగుతాయి. ఈ జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసంతో లేవలేకపోవడం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఒంటి మీద దద్దుర్లు, వాంతులు, విరేచనాలు కూడా రావొచ్చు.. అయితే ఈ జ్వరాలు మూడు రోజులు తీవ్రంగా ఉన్నా తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే.. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ను సంప్రదించాల్సిందే. డాక్టరు లక్షణాలను బట్టి అది ఏ జ్వరమో గుర్తిస్తారు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కళ్ల వెనక నొప్పి వంటి లక్షణాలుంటే అది డెంగ్యూ కింద లెక్క. జ్వరం తాత్కాలికంగానే ఉండి, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే అది చికున్ గున్యా, ఇలా లక్షణాలను బట్టి, కొన్నిసార్లు రక్త పరీక్షలు. చేసి జ్వరాన్ని గుర్తిస్తారు.

ఫ్లూ జ్వరం

ఫ్లూ జ్వరాలు రకరకాల ఫ్లూ వైరస్ ల కారణంగా వస్తాయి. సాధారణంగా ఈ జ్వరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. వీటికంటూ ప్రత్యేకించి చికిత్స కూడా అవసరం లేదు. పూ జ్వరంలో గొంతు నొప్పితో పాటు, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి జ్వరాలు ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. అయితే మూడు రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకుండా. ఉంటే.. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే కొద్దిమందిలో ఫ్లూ వైరస్ ఊపిరితిత్తులకూ వ్యాపించి న్యుమోనియాగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మూడు రోజుల తర్వాతకూడా.. శ్వాస కష్టమవుతున్నా, దగ్గు, ఆయాసం వస్తున్నా, జ్వర తీవ్రత తగ్గకుండా.. అలాగే కొనసాగుతున్నా వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది.

జ్వరమా? జలుబా?

ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే.. సాధారణ జలుబుకి, ఫ్లూ జ్వరానికి లక్షణాలు ఒకేలా ఉంటాయి. దీంతో.. వచ్చింది జలుబా? లేక ఫ్లూ జ్వరమా? అన్నది తేల్చుకోవటం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ కొంతమందికి ఫ్లూ సమస్యగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వచ్చింది పూనా? జలుబా? అనేది తేల్చుకొని, అవసరాన్ని బట్టి డాక్టర్లకు సంప్రదించటం మంచిది.

ఇవి ముఖ్యం

  •  ఏ జ్వరం వచ్చినా డాక్టర్ని సంప్రదించకుండా ఎలాంటి మందులు వాడకూడదు. అవసరమైతే
  • ప్యారాసిటమాల్ తప్ప ఇంకెలాంటి పెయిన్ కిల్లర్స్ గానీ, యాంటీబయాటిక్ గానీ వాడకూడదు.
  •  అలాగే జ్వరం త్వరగా తగ్గిపోవాలని స్టెరాయిడ్లు లాంటివి కూడా వాడకూడదు.  దీనివల్ల రోగనిరోధక శక్తి క్షీణించి జ్వరం ఇంకా ముదిరే అవకాశం ఉంటుంది.
  • మలేరియా, డెంగ్యూ అనే అనుమానం ఉంటే ముందు ఆ వ్యక్తికి దోమలు కుట్టకుండా చూడటం అవసరం. లేకపోతే వారిని కుట్టిన దోమలు ఇంట్లో ఇతరులనూ కుట్టటం ద్వారా వ్యాధి మిగతావాళ్లకు కూడా వ్యాపిస్తుంది.