టెక్నాలజీ : ఏఐతో డెత్ కాలిక్యులేషన్​!

టెక్నాలజీ : ఏఐతో డెత్ కాలిక్యులేషన్​!

మనిషి పుట్టుక, చావులు మన చేతిలో ఉండవు అంటుంటారు. కానీ.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చావు ఎప్పుడో చెప్పేస్తుందట! ఆశ్చర్యంగా అనిపించినా ఇందులో నిజం ఉంది అంటున్నారు సైంటిస్ట్​లు. ఈ టెక్నాలజీని ఏఐ డెత్ కాలిక్యులేటర్‌‌గా పిలుస్తున్నారు. లాన్సెట్‌‌ డిజిటల్ హెల్త్ ప్రచురించిన స్టడీ ప్రకారం ఏఐ డెత్ కాలిక్యులేటర్ ద్వారా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు. 

ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్‌‌ అసలు పేరు AIRE. అంటే AI-ECG రిస్క్ ఎస్టిమేటర్ (AI– ECG Risk Estimator) అన్నమాట. ఇది గుండె వైఫల్యాన్ని అంచనా వేస్తుంది. అలా గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం ఎప్పుడు ఆగిపోతుందో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్‌‌ కనిపెట్టేస్తుందన్నమాట. అంటే సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న విషయాన్ని ఇది అంచనా వేయగలుగుతుంది. వైద్యులు సులభంగా గుర్తించలేని వ్యాధుల గురించి కూడా ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్ చెప్తోందట. ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ఈ కాలిక్యులేటర్ 78 శాతం కరెక్ట్‌‌గా చెప్తోందట. 

ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్‌‌ను రూపొందిస్తున్న సంస్థ.. 11.60 లక్షల మంది రోగుల ఈసీజీ రిపోర్ట్‌‌లను కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి వారి గుండె ఎప్పుడు ఆగిపోతుందన్న వివరాలను ప్రచురించారు. అయితే ఇప్పటికైతే ఈ టెక్నాలజీ ప్రైమరీ మెడికల్​ ప్రాక్టీస్​లో భాగం కాదు. కేవలం టెక్నాలజీ డెవలప్​మెంట్​లో ఒక ట్రయల్ మాత్రమే.