
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యాన్ని దళారులు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. అడ్డదారిలో సంపాదించటానికి అలవాటుపడ్డ కొందరు డీలర్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యానికి బదులు ఇప్పటి వరకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇటీవల డబ్బుకు బదులు నిత్యావసరాలు అందిస్తున్నారు. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. గత కొంతకాలంగా లబ్ధిదారుల నుంచి డీలర్లే ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నారు. రేషన్ బియ్యానికి నల్లబజారులో డిమాండ్ అధికంగా ఉండటంతో ఇటీవల ఈ తరహా దందా మరింత ఎక్కువైంది. ఆయా ప్రాంతాల్లో బియ్యానికి ఉన్న డిమాండ్‌కి అనుగుణంగా కిలో బియ్యానికి రూ.6–-10 చొప్పున చెల్లించేవారు. కిలో బియ్యం రూ.30 వరకు బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం రైస్ మిల్లులకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు డీలర్లే హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చిన నిత్యావసరాలను లబ్ధిదారులకు అంటగడుతున్నారు. మార్కెట్‌లో తెచ్చిన ధరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రేషన్ బియ్యం ధరలను లెక్కగట్టి ఆ డబ్బుకు సరిపడా కందిపప్పు, గోధుమపిండి, పంచదార, సబ్బులు, ఉప్పు తదితరాలు పంపిణీ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి మాత్రం డబ్బులు ఇస్తున్నారు. మొత్తం లెక్కగడితే రేషన్ బియ్యం మాటున రూ.కోట్లల్లోనే అక్రమ దందా సాగుతోందని తెలుస్తోంది. డీలర్లు నిబంధనల ప్రకారమే రేషన్ దుకాణాలు నిర్వహించాలి. లబ్ధిదారులకు బియ్యానికి బదులు డబ్బు, సరుకులు ఇవ్వడం నిబంధనలు అతిక్రమించడమే. పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ దందాకు కళ్లెం వేయాలి. ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలి. - కామిడి సతీశ్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా