ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. సెమీఫైనల్స్‌గా భావించిన ఈ ఎన్నికలు ఎంతో ఉత్కంఠను రేపాయి. చివరికి గెలుపెవరిదో తేలిపోయింది. 4 రాష్ట్రాల్లో గెలవడం ద్వారా ప్రధాని మోడీ తన పాపులారిటీకి తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక పంజాబ్‌లో విజయం ద్వారా కేజ్రీవాల్.. ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలుపుకోవడంతో యోగి ఆదిత్యనాథ్ అతిపెద్ద విజేతలుగా మిగిలారు. కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లోనూ దారుణంగా దెబ్బతినడంతో.. ఆ పార్టీ లీడర్లు రాహుల్, ప్రియాంక పరాజితుల లిస్ట్‌లో మిగిలిపోయారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేసీఆర్, మమత, శరద్ పవార్ తదితర ప్రతిపక్ష నాయకులు అటు బీజేపీ, ఇటు మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో బీజేపీ పని అయిపోయిందని, మోడీ పాపులారిటీ తగ్గిపోయిందంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ఫలితాలతో వారి అడుగులు ఎలా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
గతేడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యర్థుల దృష్టి మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే పడింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పవర్లో ఉంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఒక ప్రచారం మొదలైంది. మోడీ, బీజేపీ పాపులారిటీ తగ్గిపోతోందంటూ కథనాలు వెలువడ్డాయి. నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో వైఫల్యాలను దీనికి కారణాలుగా చూపుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందంటూ అంచనాలు వేశారు.
బీజేపీ ఓడిపోతుందంటూ ప్రచారం
ఉత్తరప్రదేశ్ మన దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. అక్కడ బీజేపీ ఓటమిపాలైతే అది ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. అప్పుడు బీజేపీ, నరేంద్రమోడీ ప్రత్యర్థులు తమ విమర్శల తీవ్రతను మరింత పెంచుతారు. బెంగాల్లో వరుసగా మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ.. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారంలో ముందున్నారు. 2024లో మోడీని ఓడించడం సాధ్యమే అనే దిశగా ఈ ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడానికి, ఆ తర్వాత ప్రధాన మంత్రి కావడానికి మమతా బెనర్జీనే సరైన అభ్యర్థి అని చాలా పార్టీలు కూడా భావిస్తున్నాయి. దీంతో మమత కూడా ప్రధానమంత్రి అభ్యర్థి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆమె పర్యటనలు సాగించారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం, ప్రధానమంత్రి అభ్యర్థులుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వీరంతా దేశం కోసం తాము ఎలాంటి త్యాగాలు చేస్తామో? దేశాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతామో? చెప్పడం స్టార్ట్ చేశారు. 2024లో ప్రధాని మోడీ కచ్చితంగా ఓడిపోతారని ప్రతిపక్ష నాయకులు చెబుతూ వచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని కూడా అంచనాలు వేశారు. అంతే కాదు మోడీని ఓడించడానికి తామే సరైన అభ్యర్థులం అని వారికి వారే హింట్స్ కూడా ఇచ్చారు. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా మార్పులు చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించింది. దళిత నాయకుడైన చరణ్‌జీత్ సింగ్ చన్నీతో ఆయన ప్లేస్ ను భర్తీ చేసింది. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చాలా మంది రాజకీయ నాయకులకు ప్రశంసలు దక్కుతుంటే.. మరికొందరికి ఎదురుదెబ్బలే మిగిలాయి.
అసలు విజేతలు వీరే
నరేంద్రమోడీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అతి పెద్ద విజేత మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. బీజేపీ 4 రాష్ట్రాలను గెలవడం ఇందుకు కారణం కాదు. నరేంద్రమోడీ పాపులారిటీ లేనట్లయితే బీజేపీ ఈ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించేది కాదేమో. ఈ ఎన్నికలు మోడీ పాపులారిటీని మరోసారి నిరూపించాయి. ఆయన అతి పెద్ద ప్రజాకర్షణ కలిగిన నాయకుడని తెలియజేశాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు త్వరలో రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీకి నమ్మకం కలిగించాయి. అలాగే 2024లో జరిగే జనరల్ ఎలక్షన్లకు సిద్ధమయ్యేందుకు కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓటమిపాలైతే మాత్రం పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోవచ్చు.
యోగి ఆదిత్యనాథ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పరపతిని నిరూపించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అంతకుముందు ఉన్న 320 సీట్ల నుంచి సుమారు 260 సీట్లను సాధించి యోగి తన సీఎం సీటును నిలబెట్టుకున్నారు. ఒకవేళ యోగి ఇంకా ఎక్కువ స్థాయిలో సీట్లు సాధించినట్లయితే.. ఆయన పేరు మరింత మారుమోగిపోయేది.
కేజ్రీవాల్: ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే, అతి పెద్ద విజేత మాత్రం ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాలే. ఆయన పార్టీ పంజాబ్‌లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు దేశంలోనే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ నిలిచింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను లీడ్ చేసే స్థాయికి చేరుకునే అవకాశం దక్కింది. పంజాబ్‌లో ఘన విజయంతో ప్రతిపక్షాల లీడర్షిప్ను ఇప్పుడు కేజ్రీవాల్ డిమాండ్ చేయవచ్చు.
బీజేపీ: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించవచ్చు. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత, బీజేపీ భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ సిద్ధం కావడం ఇప్పుడు సులువైంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఇప్పుడు బీజేపీకి నల్లేరుపై నడకే. వాస్తవానికి, కొందరు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు వారు తమ ఆలోచనను మార్చుకోవచ్చు. ఇక బీజేపీ విజయం సాధించిన మిగతా మూడు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేరు. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లో పార్టీ విజయం పూర్తిగా బీజేపీ, అలాగే నరేంద్రమోడీ ఇమేజ్‌పై ఆధారపడి సాధించినదే.
అఖిలేశ్ యాదవ్: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించలేకపోయి ఉండొచ్చు. కానీ, ఆయన పార్టీ సామర్థ్యాన్ని మాత్రం గణనీయంగా పెంచుకున్నారు. 2017లో 57 ఎమ్మెల్యేలను మాత్రమే గెలిచిన ఎస్పీ ఈ సారి 110కిపైగా సీట్లను సాధించింది. అఖిలేశ్ యాదవ్ కచ్చితంగా బీజేపీకి గట్టిపోటీ ఇచ్చారని చెప్పవచ్చు. అందువల్ల అఖిలేశ్ ఓటమిపాలైనా.. తన స్థాయిని మాత్రం పెంచుకున్నారు.
ఓటమి బాధ వీరికే ఎక్కువ
రాహుల్‌గాంధీ: ఈ ఎన్నికల్లో అతి పెద్ద పరాజితుడు మాత్రం రాహుల్‌గాంధీనే. ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రిని మార్చిన రాహుల్‌గాంధీ.. చరణ్ జీత్ చన్నీని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని లెక్కలుగట్టారు. కానీ, పంజాబ్‌లో కాంగ్రెస్ చాలా దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మిగిలినవి రెండు రాష్ట్రాలు మాత్రమే. పంజాబ్‌లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినడానికి ప్రధాన కారణం రాహుల్‌గాంధీనే. ఇక్కడ తన పార్టీ తీవ్రంగా దెబ్బ తినడం ఒక్కటే కాదు.. ప్రతిపక్షంలో కేజ్రీవాల్ డామినేషన్‌కు అవకాశం దక్కింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు కూడా చాలా మంది రాహుల్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. వారంతా ఇప్పుడు రాహుల్ కు వ్యతిరేకంగా గొంతు విప్పే అవకాశం ఉంది.
చరణ్‌జీత్ చన్నీ: పంజాబ్‌లో అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు చరణ్ జీత్ చన్నీ. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. పంజాబ్‌లో 32 శాతం ఉన్న దళితులు ఆయనకు ఓటు వేస్తారని రాహుల్‌గాంధీ నమ్మారు. కానీ వారు కాంగ్రెస్‌ను నమ్మలేదు. దీంతో చన్నీ ఓటమిపాలయ్యారు. కానీ, ఐదు నెలల తన పాలనా కాలంలో చన్నీ తన మార్కు చూపించారు. కానీ చివరికి తాను పోటీ చేసిన చోట్ల కూడా ఆయన ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం చన్నీ పొలిటికల్ కెరీర్‌కు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పడినట్లే భావించాలి.
ప్రియాంకా గాంధీ: ఓడిపోయిన వారిలో ఒకరిగా మిగిలారు ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఇన్చార్జ్గా వ్యవహరించారు. కానీ, అక్కడ కాంగ్రెస్ పార్టీకి 2 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ చరిత్రలోనే అతి తక్కువ ఓట్ల శాతమిది. నరేంద్రమోడీపై విమర్శలు చేయడం ద్వారా ఎక్కువ మీడియా ప్రాధాన్యతను ప్రియాంక దక్కించుకోగలిగింది. దీని వల్ల ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆమె ఆశించారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 400 సీట్లకు కాంగ్రెస్ పోటీపడితే గెలిచినవి రెండు మాత్రమే. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు ప్రియాంక సైలెంట్‌గా ఉండే అవకాశం ఉంది. పంజాబ్‌లో కూడా ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోషల్ మీడియా జిమ్మిక్కులు.. ఫొటోషాప్ ఫొటోలు పెద్దగా పనిచేయలేదని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం బీజేపీలో నరేంద్రమోడీకి ప్రత్యర్థి అనే వారే లేరు. కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. కేసీఆర్ హైదరాబాద్‌కే పరిమితమవుతారా? మమతాబెనర్జీ కోల్‌కతా నుంచి కాలు బయటపెట్టరా? శరద్ పవార్ ఏం చేస్తారు? ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు వీరంతా భవిష్యత్ గురించి ఎక్కువగా మాట్లాడిన వారే. మోడీ ఎలా ఓడిపోతారో చెప్పిన వారే. కానీ.. ఇప్పుడు వీరంతా సైలెంట్ అయిపోవచ్చు. ఒక్క కేజ్రీవాల్ మాత్రమే ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరగవచ్చు. వీరందరినీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి కేజ్రీవాల్ ఆహ్వానించే అవకాశం ఉంది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్