
ఉగాదినాడు తెలుగు కొత్త సంవత్సరాది మొదలైపోతుందని అందరికి తెలిసిందే. అయితే తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి... ఈ ఏడాది 2025 మార్చి 30న ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం విశిష్టత ఏమిటి.... ఈ విశ్వావసుడు ఎవరు.. పురాణాల ప్రకారం ఆయన చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. . .
తెలుగు పంచాంగం... పురాణాల ప్రకారం.. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం అమావాస్య తరువాత రోజునుంచి తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 29న క్రోధినామ సంవత్సరం ముగిసి... మార్చి 30న కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ప్రారంభంకానుంది. తెలుగుసంవత్సరాల్లో ఇది 39 వది . విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడదని... ఆయన గొప్ప సంగీత కళాకారుడని బ్రహ్మపురాణం ద్వారా తెలుస్తుంది. ఈయననే త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. కృతయుగంలో గంధర్వుడిగా ఉన్న విశ్వావసుడు శాపం వలన.. త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. రామాయణంలో కబంధుడి ప్రస్తావన కూడా వస్తుంది.
విశ్వావసుడికి ఎలా శాపం వచ్చింది..
బ్రహ్మ పురాణంలో చెప్పిన విధంగా విశ్వావసు ఒక గంధర్వుడు మంచి గాయకుడు... నృత్యకారుడు... సంగీతకారుడు..అంతేకాదు ఈయన ఇన్ని విద్యలతో పాటు అందంగా కూడా ఉండటంతో అప్సరలతో కలిసి జీవించేవాడు. ఈయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. తనకి చావు లేదని తెలిశాక విశ్వావసు అహంకారిగా మారాడని.. ఆ తరువాత ఇంద్రుడి పైనే దాడి చేశాడట.
►ALSO READ | Ugadi 2025: ఉగాది పచ్చడి మహాఔషధం.. ఎన్ని రోజులు తినాలి..
ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను, తొడలను శరీరంనుంచి తీసేయడంతో తల.. తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడని.. బ్రహ్మపురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుని వేడుకున్నాడు. దాంతో ఇంద్రుడు అతనికి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చి... శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వావసు కబంధుడై రాక్షసుడిగా జీవించసాగాడు.
రామాయణంలో కబంధుడు
రాక్షస అవతారంలో అడవుల్లో ఉండే కబంధుడు ఋషులను భయపడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడుకి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళ్లాడు. జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు. వారికి కబంధుడు కనిపించాడు. రాముడు, లక్ష్మణుడి దారికి ఇతను అడ్డుపడ్డాడు. కోపంతో రాముడు అతడి చేతులను నరికి వేశాడు. కబంధుడు తన చేతులు నరికి వేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు. తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు.
రాముడు అలా చేయగానే కబంధుని రాక్షసరూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో, చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వలోకానికి వెళ్లిపోయాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటారు.
తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి?
తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక మరో కథను చెప్పుకుంటారు. నారదుడు ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతారు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువును శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరం ఇస్తారు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు.
►ALSO READ | ఉగాది పిండి వంటలు : భక్ష్యాలు, కొబ్బరి బూరెలు ఇంట్లోనే టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు..!
తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్లా… ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్న క్రోధినామ సంవత్సరంతో పోలిస్తే ..మార్చి 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వావసు సంవత్సరం ఎంతో మంచిదని చెబుతారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ ఉగాది పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని .. విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మేలే జరగాలని కోరుకుందాం. .. సర్వే జనో సుఖినో భవంతు.. లోకాం సమస్తాం సుఖినో భవంతు.. అందరికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...