సెమీఫైనల్లో గెలుపెవరిది?

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. 2024 లోక్​సభ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్స్​గా భావిస్తున్నారు. పంజాబ్​ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్ లో కూడా విజయం సాధించి 2024 లోక్​సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రాష్ట్రాల పరిధిలో ఉన్న 102 లోక్​సభ స్థానాల్లో 2019లో 72 సీట్లలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. పంజాబ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవటంతోపాటు గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌‌‌‌లో గెలిచి ఉత్తరప్రదేశ్ లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీకి చెక్​ పెట్టి ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని సమాజ్ వాదీ పార్టీ ప్లాన్లు వేస్తోంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నా.. యూపీలో ఎస్పీ సీట్ల సంఖ్య భారీగా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంజాబ్ లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
 

పంజాబ్ లో గెలుపు కాంగ్రెస్ కు కీలకం

వరుసగా మూడోసారి గెలిచి పంజాబ్​లో హ్యాట్రిక్ కొట్టాలన్న కాంగ్రెస్ ఆశలపై ఆ పార్టీ నేతలే నీళ్లు చల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ గెలిచే అవకాశాలను చేజేతులా వదులుకున్న కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు ఓటమి అంచున నిలబడింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలను పరిష్కరించలేని కాంగ్రెస్ తన అపరిపక్వ నిర్ణయాలతో పరిస్థితులను క్లిష్టంగా మార్చుకుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, అకాలీదళ్-బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరిగిన పంజాబ్ లో తొలిసారిగా పంచముఖ పోరుకు తెరలేచింది. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, బీజేపీ కూటమి, అకాలీదళ్ కూటమి, 19 రైతు సంఘాల సంయుక్త మోర్చా మధ్య ఎన్నికల పోరు జరగనుంది. ఆప్​ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగు చట్టాలపై పోరాటంలో రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గ్రహించిన అకాలీదళ్.. బీజేపీతో దశాబ్దాల పొత్తును తెగదెంపులు చేసుకుంది. అయితే అమరీందర్​సింగ్​ పార్టీ రూపంలో బీజేపీకి ఒక ఆయుధం దొరికింది. పంజాబ్ లో అధికారం నిలబెట్టుకోలేకపోతే అది రాజకీయంగా కాంగ్రెస్​కు పెద్ద దెబ్బే. తాను గెలవకపోయినా కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకోవాలన్న అమరీందర్ సింగ్ ప్రయత్నాలు సక్సెస్​ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

దేవభూమిలో అధికార మార్పిడి జరిగేనా..

ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోరు జరగనుంది. 2002 తర్వాత ఈ రాష్ట్రంలో ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం దక్కలేదు. ఆప్, ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ పార్టీలు ఉన్నా వాటి పోటీ నామమాత్రమే. ఈ రాష్ట్రంలో 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ త్రివేంద్ర సింగ్, తీరథ్​ సింగ్ లను మార్చి పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ప్రతికూలాంశమే. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నారాయణ్ దత్ తివారీ మాత్రమే ఐదేండ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్నారు. అంటే రెండు పార్టీలు తరచూ ముఖ్యమంత్రులను మార్చుతూనే ఉన్నాయి. కాంగ్రెస్​లో మాజీ సీఎం హరీష్ రావత్ కు ఇంటిపోరు తప్పేలా లేదు. హరీష్ రావత్, ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ వర్గాల మధ్య సఖ్యత లేకపోవడం కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. కేదార్‌‌‌‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణం, సువిశాల రహదారుల నిర్మాణం, రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు మార్గ నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ కంటే బీజేపీ బలంగా కనిపిస్తున్న ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి కమలనాథులు అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి.
 

గోవా ఈసారైనా చేతికి చిక్కేనా..

40 సీట్లు ఉన్న గోవా అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో 17 చోట్ల గెలిచి కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 13 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల సహకారంతో మనోహర్ పారికర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గతంలో కంటే బలహీనంగా మారింది. మాజీ సీఎం ఎడ్వర్డ్ ఫెలిరో లాంటి బలమైన నేత తృణముల్ కాంగ్రెస్​లో చేరారు. తృణముల్, ఆప్​ తమ బలాన్ని పెంచుకోవడంతో ఈసారి కాంగ్రెస్ కు నిరాశ తప్పేలా లేదు. ఎన్సీపీ లీడర్​ శరద్ పవార్ ప్రయత్నాలు ఫలించి కాంగ్రెస్, తృణముల్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడితే బీజేపీని కొంతమేరకు ప్రతిఘటించవచ్చు. ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్.. పారికర్ అంత బలమైన నాయకుడిగా ఎదగకపోవడం, బలమైన కేథలిక్ లీడర్ లోబో కాంగ్రెస్​లో చేరటం బీజేపీకి కొంత నష్టం కలిగించవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ మిగతా పక్షాల కంటే బీజేపీ బలంగా కనిపిస్తోంది.
ఈశాన్యం బీజేపీ వైపే..
ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీ బలమైన పునాదులు కలిగి ఉండేది. కానీ, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఒక్కో ఈశాన్య రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుని ఈశాన్య భారతంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. 2017 ఎన్నికల్లో 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో విఫలమైంది. 21 సీట్లు గెలిచిన బీజేపీ నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీల మద్దతుతో ఎస్పీ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు ఒక్రం ఇబోబి సింగ్ లాంటి బలమైన నేతలు ఉన్నప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఈశాన్య రాష్ట్రాలపై బలమైన రాజకీయ ప్రభావం ఉండటం వల్ల ఈసారి కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. మరోసారి బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు.
 

ఇప్పుడు గెలిస్తే 2024లో ఈజీ

2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకొని పంజాబ్ లో నిర్ణయాత్మక శక్తిగా మారినా ఆ పార్టీకి మంచిదే. 2024కు ముందు జరిగే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ముఖాముఖి తలపడి బీజేపీ విజయం సాధిస్తే కేంద్రంలో హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది. కానీ, ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వెలువడితే మాత్రం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. అప్పుడు 2024 లోక్​సభ ఎన్నికల నాటికి బీజేపీని ఎదుర్కోవటానికి తృణముల్ కాంగ్రెస్​ చీఫ్​ మమతాబెనర్జీ, ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ థర్డ్​ ఫ్రంట్ ను తెర మీదికి తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ సహకారం లేకుండా ఏర్పాటవుతుందని ఊహిస్తున్న ఈ ఫ్రంట్ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా ఎంత వరకు అడ్డుకోగలదనేది ఇప్పుడు అందరి ముందూ ఉన్న ప్రశ్న.

ప్రధానులను అందించే రాష్ట్రం

మనదేశాన్ని 15 మంది ప్రధానమంత్రులు పరిపాలిస్తే వారిలో 11 మంది ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. దేశంలోనే అత్యధికంగా 80 లోక్​సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మరోసారి ఉత్తరప్రదేశ్ లో గెలిచి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బాటలు వేసుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్​ కారిడార్, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, లా అండ్​ ఆర్డర్​ మెరుగుపడటం తమకు కలిసి వస్తాయని బీజేపీ నమ్మకంగా ఉంది. కానీ కరోనా మహమ్మారి నియంత్రణలో వైఫల్యం, సాగు చట్టాలపై రైతుల్లో వ్యతిరేకత, లఖింపూర్ ఖేరి, హత్రాస్, ఉన్నావ్ ఘటనలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయి. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బలం పుంజుకుంది. బీజేపీపై బ్రాహ్మణుల అసంతృప్తి, ముస్లిం, యాదవ ఓటు బ్యాంకుతోపాటు ఓబీసీల అనుకూలత ఎస్పీకి కలిసి వచ్చే చాన్సులు ఉన్నాయి. నిన్నటి వరకు యోగి కేబినెట్​లో ఉన్న మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి కలిసివచ్చేదే. రాష్ట్రంలో 14 శాతం ఉన్న బ్రాహ్మణ ఓటు బ్యాంకును పొందటానికి బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ ప్రయత్నిస్తున్నాయి. గతంలో బీజేపీ వైపు నిలిచిన బ్రాహ్మణ వర్గాలు యోగి వైఖరితో దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని బ్రాహ్మణ వర్గానికి చెందిన జితిన్ ప్రసాద్ లాంటి వారిని చేర్చుకొని కేబినెట్​లో ప్రాధాన్యత కల్పించినా బ్రాహ్మణ ఓట్లలో చీలిక తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 19 శాతం ఓటు బ్యాంకు కలిగిన ముస్లిం మైనార్టీలు మద్దతుగా నిలవడంతో ఎస్పీ బీజేపీకి బలమైన సవాలు విసిరే స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా ఓట్లను ఆకర్షించేందుకు ప్రియాంకాగాంధీ అస్త్రాన్ని ప్రయోగిస్తూ.. పూర్వవైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది.

                                                                                                                                                                              - డాక్టర్ తిరునాహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్