మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది?

మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది?
  • మాజీ ఈఎన్సీ మురళీధర్​, డిప్యూటీ సీఈ అజ్మల్​ ఖాన్​ను ప్రశ్నించిన విజిలెన్స్ విభాగం

  • నిర్మాణంలో మార్పులు ఎందుకు చేశారు?

  • డిజైన్  ఎందుకు మార్చారని ప్రశ్న

  • పర్యవేక్షణ లేక బ్యారేజీ కుంగిందన్న అధికారులు

  • మేడిగడ్డ బ్యారేజీపైఎంక్వయిరీ స్పీడప్

  • రేపు, ఎల్లుండి ఎంక్వయిరీకి పలువురు అధికారులు

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​ డిపార్ట్​మెంట్​ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్​ డ్యామేజీపై ఇటీవలే కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​కు మధ్యంతర నివేదికను సమర్పించిన విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​.. వీలైనంత త్వరగా పూర్తి రిపోర్టును కమిషన్​కు ఇవ్వాలని యోచిస్తున్నది. అందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భాగమైన ఇంజనీరింగ్​ ఉన్నతాధికారులను విచారిస్తున్నది. శనివారం బీఆర్కే భవన్​లోని విజిలెన్స్​ ఆఫీసులో మాజీ ఈఎన్సీ మురళీధర్, డిప్యూటీ సీఈ అజ్మల్​ ఖాన్​ను విచారించింది. 

మేడిగడ్డ బ్యారేజీ  నిర్మాణంలో జరిగిన లోపాలపై ఆరా తీసింది. ‘‘బ్యారేజీ ఎందుకు కుంగింది? బ్యారేజీ సైట్​లో ప్రాబ్లమ్స్​ ఉన్నాయా? జియో టెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేశారా? మోడల్​ స్టడీస్​ను సరిగా నిర్వహించారా?’’ అని ప్రశ్నలు వేసింది. ప్రాజెక్టును ప్రారంభించిన మూడేండ్లకే కుంగడానికి కారణమేంటని ప్రశ్నించినట్లు సమాచారం. బ్యారేజీ డిజైన్లు మార్చారని మాజీ అధికారులు చెబుతున్నారని, వారి వ్యాఖ్యల్లో నిజముందా అని అడిగినట్లు తెలిసింది. ‘‘డిజైన్లను మార్చారా? మారిస్తే ఎందుకు మార్చారు? అనుకున్న లొకేషన్​లోనే బ్యారేజీ నిర్మించారా?” అని అడిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

ఓ అండ్​ ఎం సరిగ్గా లేదు

బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి ఓ అండ్​ ఎం సరిగ్గా జరగలేదని విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ విచారణలో అధికారులు చెప్పినట్లు తెలిసింది. లోపాలు బయటపడిన రోజే ఓ అండ్​ ఎం సరిగ్గా నిర్వహించి ఉంటే బ్యారేజీ కుంగి ఉండేది కాదని వివరించినట్లు సమాచారం. ‘‘బ్యారేజీ నిర్మాణంలో  నాణ్యతను గాలికొదిలేశారా? బ్యారేజీని వ్యాప్కోస్​ ఇచ్చిన డీపీఆర్​కు అనుగుణంగా ఎందుకు నిర్మించలేదు? డీపీఆర్​లో సూచించినట్టు ఎందుకు ఫాలో కాలేదు?” అని విజిలెన్స్​ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. 

బ్యారేజీ నిర్మించే ప్రదేశం ఆధారంగా నిర్మాణానికి ఏం వాడాలో అవే వాడామని, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు బ్యారేజీని మేడిగడ్డకు తరలించాల్సి వచ్చిందని అధికారులు చెప్పినట్లు తెలిసింది. బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన అన్ని టెస్టులు చేశారని, బ్యారేజీ నిర్మించాక సరైన నిర్వహణ లేకపోవడం, క్వాలిటీ చెకింగ్​లు ఎక్కువ చేయకపోవడం, లోపాలు గుర్తించినా రెక్టిఫై చేయకపోవడం వంటి కారణాల వల్లే బ్యారేజీకి నష్టం జరిగిందని అధికారులు వివరించినట్లు సమాచారం. కాగా, సోమవారం ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి. నాగేందర్​రావు, మంగళవారం సీడీఓ మాజీ సీఈ  శ్రీనివాస్, వర్క్స్​ అండ్​ అకౌంట్స్​ డిపార్ట్​మెంట్​ డైరెక్టర్​ వి.ఫణిభూషణ్​ రావును విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ విచారించనుంది. 

ఓన్లీ మేడిగడ్డ బ్యారేజీపైనే.. 

మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీపైనే విజిలెన్స్​ డిపార్ట్​మెంట్  విచారణ చేపడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి తొలుత మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ పరిశీలించిన విజిలెన్స్​ అధికారులు.. వాటిపైనా అప్పట్లో ప్రాథమికంగా జలసౌధలో ఇంజనీరింగ్​ అధికారుల నుంచి వివరాలను సేకరించారు. అయితే, విజిలెన్స్​ మాజీ డైరెక్టర్​ జనరల్​ రాజీవ్​ రతన్​ హఠాన్మరణంతో విచారణ ఆలస్యమైంది. ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 2 నెలలపాటు డీజీని నియమించలేదు. ఆ తర్వాత సీవీ ఆనంద్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఈ క్రమంలోనే కాళేశ్వరం కమిషన్​ కూడా విచారణ జరుపుతుండడం.. విజిలెన్స్​ రిపోర్టును వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించడంతో ఇటీవల కమిషన్​కు సీవీ ఆనంద్​ మధ్యంతర నివేదికను సమర్పించారు. ఇటీవల విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​కు డీజీగా కొత్తకోట సుధాకర్​ రెడ్డిని నియమించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వర్గాలు తొలుత మేడిగడ్డ బ్యారేజీపైనే ఫోకస్​ పెట్టాల్సిందిగా సూచించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా దృష్టి సారిస్తే మేడిగడ్డ రిపోర్టు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ఇటు డిపార్ట్​మెంట్​లో ఇంజనీరింగ్​ అధికారుల కొరత కూడా ఉందని, అందుకే ఒక్క మేడిగడ్డ బ్యారేజీపైనే విచారణ జరపాలని సూచించినట్లు సమాచారం.