సూర్యాపేట, వెలుగు : ‘జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్‌లు వేసి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, అర్హులైన వారి పింఛన్లు కూడా ఎందుకు తొలగిస్తున్నారు’ అని సూర్యాపేట జడ్పీ సభ్యులు ఆఫీసర్లను ప్రశ్నించారు. చైర్‌పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌కు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హాజరయ్యారు. మీటింగ్ ప్రారంభం కాగానే సభ్యులు వివిధ సమస్యలపై ఆఫీసర్లను నిలదీశారు. వైస్ చైర్మన్ వెంకటనారాయణ మాట్లాడుతూ అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదన్నారు. గతంలో ఉన్న పైప్‌లైన్లకే భగీరథ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల లీకేజీలు ఏర్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిగూడెం, మఠంపల్లి, మునగాల మండలాల్లో ఒక్క గ్రామానికి కూడా నీరు సరఫరా కావడం లేదని ఎంపీపీలు వివరించారు.
సూర్యాపేట మండలంలో వారానికి ఒక్కసారి కూడా నీరు రావడం లేదని, ఇలా అయితే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవన్నారు. సదరం క్యాంపుల్లో అనర్హులకు సర్టిఫికెట్స్ ఇస్తూ, అర్హులను రిజక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. మేళ్లచెరువు ఎంపీపీ మాట్లాడుతూ మినరల్ ఫండ్స్ వస్తున్నా పీహెచ్‌సీని బాగు చేయడం లేదన్నారు. సూర్యాపేట జడ్పీటీసీ మాట్లాడుతూ కాసరాబాద్ పీహెచ్‌సీలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురుకులాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించడం లేదని, గిరిజన గురుకులాల్లో అర్హత లేకున్నా అక్రమ నియామకాలు చేపట్టారన్నారని, వాటిపై కలెక్టర్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 52 డిపార్ట్‌మెంట్లపై చర్చించాల్సి ఉండగా కేవలం 15 శాఖలపైనే చర్చించి మీటింగ్‌ను ముగించారు.
వివాదానికి దారి తీసిన ఆఫీసర్
జడ్పీ మీటింగ్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రి పర్యవేక్షణాధికారి వెంకటేశ్వర్లు మాటలు వివాదానికి దారి తీశాయి. ఆయన మాట్లాడే సందర్భంలో ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ప్రభుత్వ హస్పిటల్స్‌ను కార్పొరేట్ మాదిరిగా తీర్చిదిద్దారు’ అని చెప్పారు. దీంతో కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీలు అభ్యంతరం తెలిపారు. ఆఫీసర్‌లా మాట్లాడాల్సిన వ్యక్తి అధికార పార్టీ నాయకుడిలా మాట్లాడడం సరికాదన్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీచైర్మన్ జోక్యం చేసుకొని నచ్చజెప్పారు.