ప్రేమించి పెండ్లి చేసుకుని జల్సాలు.. ప్రశ్నించినందుకు భార్య, అత్తపై కత్తితో దాడి.. మియాపూర్లో ఘటన

 ప్రేమించి పెండ్లి చేసుకుని జల్సాలు.. ప్రశ్నించినందుకు భార్య, అత్తపై కత్తితో దాడి.. మియాపూర్లో ఘటన

మియాపూర్, వెలుగు: హైదరాబాద్ లో  మద్యం మత్తులో  ఓ భర్త  భార్య, అత్తపై దాడి చేశాడు.  ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మియాపూర్ ఇన్ స్పెక్టర్  క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం.. చందానగర్‌‌ హుడా కాలనీలో ఉండే మంగా, శ్రీను దంపతులకు  శ్రీదేవి (26), సత్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  శ్రీదేవి క్యాబ్ డ్రైవర్ మహేశ్ ను ప్రేమించి 2022  మే 4న ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకుంది. దంపతులు  మియాపూర్ లోని జనప్రియ నగర్‌‌ లో ఉంటున్నారు. వీరికి ఒక పాప. ఇదే కాలనీలో మహేశ్ తల్లిదండ్రులు, సోదరుడు సాయికుమార్  మరో ఇంట్లో  ఉంటున్నారు. 

కొంతకాలంగా మహేశ్ తాను పనిచేసే డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కింద శ్రీదేవి తన కుమార్తెను  తీసుకుని పుట్టింటికి వెళ్లింది. సోమవారం శ్రీదేవి కి మహేశ్  కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన  తర్వాత  తన తమ్ముడు సాయికుమార్ పుట్టినరోజు ఉందని వేడుకలకు వెళ్లాలని చెప్పాడు. అందుకు శ్రీదేవి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో  కోపోద్రిక్తుడైన మహేశ్   భార్య పై చేయి చేసుకున్నాడు.  భర్త కొట్టిన విషయాన్ని  ఆమె  తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది.  

అదేరోజు సాయంత్రం 7 గంటలకు కుమార్తె ఇంటికి వచ్చిన మంగ(45),  ఎందుకు కొట్టావని ప్రశ్నించి అల్లుడిని  నిలదీసింది.  దీంతో మరింత కోపోద్రిక్తుడైన  మహేశ్ వంట గదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి  ముందుగా భార్య మెడపై దాడి చేశాడు.  అడ్డుకోబోయిన అత్త పైనా దాడి చేశాడు.  తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.   శ్రీదేవికి మెడపై గాయాలు కాగా, తల్లి మెడ, చేతులపై తీవ్ర  గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది.  బాధితురాలు శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.