పొద్దున భర్త మృతి.. సాయంత్రం భార్య మృతి

పొద్దున భర్త మృతి.. సాయంత్రం భార్య మృతి

అయిజ, వెలుగు : భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పచ్చార్లకు చెందిన లక్ష్మి రెడ్డి (72), లక్ష్మిదేవి (68) బతుకుదెరువు కోసం గద్వాలలో హోటల్  నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున లక్ష్మిరెడ్డికి గుండెపోటు వచ్చింది. 

ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆయన చనిపోయాడు. సాయంత్రం ఆయన అంత్యక్రియలు స్వగ్రామం పచ్చర్ల లో జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి భార్య అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెకు షుగర్  లెవెల్స్  పడిపోవడంతో శ్మశానవాటిక వద్ద అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన శాంతినగర్ లోని హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్  అప్పటికే ఆమె మృతి చెందారని తెలిపారు. ఒకేరోజు వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా చిన్న కుమారుడు గతంలో మృతి చెందాడు.