
- –పోటీలో సుమిత్ నగాల్
- మరో 9 రోజుల్లో పారిస్ ఒలింపిక్స్
డేవిస్ కప్‌లో మెరిశాం.. కామన్వెల్త్‌లో సత్తా చాటాం.. ఆసియా గేమ్స్‌లో అదరగొట్టాం.. కానీ ఒలింపిక్స్‌లో ఇండియా టెన్నిస్ ప్లేయర్లు మెప్పించలేకపో తున్నారు. అప్పుడెప్పుడో 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ నెగ్గిన ఏకైక బ్రాంజ్ మెడల్ మినహా మళ్లీ ఇంతవరకు ఇండియాకు పతకం దక్కలేదు. కారణాలు ఏమైనా.. వందేండ్ల ఇండియన్ ఒలింపిక్ టెన్నిస్ హిస్టరీలో సానియా మీర్జా, రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ, యూకీ భాంబ్రీలాంటి సీనియర్లు దివిజ్ శరణ్, అంకితా రైనాలాంటి యంగ్‌స్టర్స్ పోరాడినా రెండో పతకాన్ని సాధించలేక పోయారు. మరి కెరీర్ చివరి దశలో ఉన్న బోపన్న ఈసారైనా ఆ కల నెరవేరుస్తాడా?
వెలుగు స్పోర్ట్స్ డెస్క్
1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా తొలిసారి టెన్నిస్‌లో అరంగేట్రం చేసింది. ఆంగ్లో ఇండియన్స్ ఆథర్ అలీ ఫైజీ, నోరా మార్గరెట్ పోలీ, సిడ్నీ జాకబ్, మహ్మద్ హాది, డొనాల్డ్ రుత్నం, మహ్మద్ సలీమ్ తొలిసారి ఇండియా తరఫున ఆడినా ఒకటి, రెండు రౌండ్లలోనే వెనుదిరిగారు. వీళ్ల తరం ముగిసిన తర్వాత ఇండియా నుంచి 20 మంది ప్లేయర్లు ఒలింపిక్స్‌లో టెన్నిస్ ఆడారు.
ఇందులో పేస్ మినహా మరెవరూ సక్సెస్ కాలేదు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నా తుది దశ వరకు చేరలేకపోతున్నాం. మళ్లీ వందేండ్ల తర్వాత అదే పారిస్ గడ్డపై ఇండియా రెండో పతకం కోసం వేట మొదలుపెడుతున్నది. ఈసారి సుమిత్ నగాల్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో బోపన్న–శ్రీరామ్ బాలాజీ జోడీ మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది.
మెడల్‌తో ముగించాలని..
వరల్డ్ టెన్నిస్‌లో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్న రోహన్ బోపన్న మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాడు. 44 ఏండ్ల బోపన్నకు ఇదే చివరి మెగా గేమ్స్. సుదీర్ఘ కెరీర్‌లో రెండు గ్రాండ్‌స్లామ్స్, ఆరు ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన అతని ఖాతాలో ఒలింపిక్స్ మెడల్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. దీంతో మెగా మెడల్‌ను కూడా నెగ్గి కెరీర్‌ను పరిపూర్ణం చేసుకోవాలని బోపన్న లక్ష్యంగా పెట్టుకున్నాడు. మెన్స్ డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీతో కలిసి బోపన్న బరిలోకి దిగుతున్నాడు.
ఈ నెల 26న మొదలయ్యే ఒలింపిక్స్‌లో 32 మేటి టెన్నిస్ టీమ్స్ పోటీపడుతున్నాయి. డబుల్స్‌లో నాలుగో ర్యాంక్‌తో బోపన్న అర్హత సాధించాడు. 67వ ర్యాంక్‌లో ఉన్న బాలాజీకి ఇదే తొలి ఒలింపిక్స్. 2012 ఒలింపిక్స్‌లో మహేశ్ భూపతితో కలిసి ఆడిన బోపన్న రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. 2016లో సానియాతో కలిసి మిక్స్‌డ్ ఆడిన బోపన్న బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓడి కొద్దిలో పతకం చేజార్చుకున్నాడు.
సుమిత్.. ఎంత వరకు
టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిననగాల్ రెండో రౌండ్‌ను దాటలేదు. తొలి రౌండ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించిన అతను రెండో రౌండ్‌లో మెద్వెదెవ్ చేతిలో ఓడాడు. అయితే ఈ ఏడాది మంచి ఫామ్‌ను చూపెట్టిన నగాల్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 77వ ర్యాంక్‌తో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరి ఈసారైనా రెండో రౌండ్‌ను అధిగమిస్తాడో లేదో చూడాలి. ఈ ఏడాది ఆరంభంలో హీల్‌బ్రోన్ చాలెంజర్ నెగ్గిన నగాల్, చెన్నై ఓపెన్‌లోనూ సత్తా చాటాడు. తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఓ మోస్తరుగా ఆడాడు
. అనంతరం ఏటీపీ మాస్టర్స్ టోర్నీలో సత్తా చాటిన అతను కెరీర్ హయ్యెస్ ర్యాంక్ (68)ను అందుకున్నాడు. ప్రస్తుతం అతని ఫామ్‌ను చూస్తుంటే మూడో రౌండ్ వరకు వెళ్లే చాన్సెస్ ఉన్నాయి. మెన్స్ సింగిల్స్‌లో మొత్తం 64 మంది ప్లేయర్లు పోటీపడతారు.