స్టూడెంట్స్​పై చాట్​ జీపీటీ ప్రభావంపై చర్చ

స్టూడెంట్స్​పై చాట్​ జీపీటీ ప్రభావంపై చర్చ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున ఆన్సర్లు చెప్పేస్తున్న ‘చాట్ జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. దీని ప్రభావం స్టూడెంట్లపై ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ టెక్నాలజీని నిషేధించాలని కొందరు.. అద్భుతమని మరికొందరు వాదిస్తున్నారు. 

లాభాలు

  • గ్రామీణ  స్టూడెంట్స్ ​దీన్ని  ట్యూటర్​లా వాడుకోవచ్చు. ఇంట్లో కూర్చొని డౌట్స్​ క్లియర్​ చేసుకోవచ్చు
  • వ్యక్తి నాలెడ్జ్​ లెవల్ ను అంచనా వేసి  సింపుల్​ లాంగ్వేజ్, ఈజీ వేలో ఆన్సర్స్​ ఇస్తుంది
  • సెకన్లలోనే ఆన్సర్స్​ దొరుకుతాయి. సమయం ఆదా
  • టీచర్స్​ కూడా లెర్నింగ్, లెసన్​ ప్లాన్స్​ ప్రిపేర్​ చేసుకోవచ్చు
  • ప్రస్తుతానికి చాట్​ జీపీటీ ఫ్రీ

నష్టాలు

  • క్రియేటివిటీ, బ్రెయిన్​ వర్క్​ తగ్గుతుంది
  • సబ్జెక్టును లోతుగా నేర్చుకోవడంపై స్టూడెంట్స్ దృష్టి పెట్టకపోవచ్చు
  • తప్పు ఆన్సర్​ ఇస్తే  ఫ్యాక్ట్​ చెక్​ చేసుకోవడం స్టూడెంట్స్​కు తెలియదు
  • ఒక ప్రశ్నకు ఒక్కోసారి ఒక్కో ఆన్సర్​ చూపించే అవకాశం  
  • చదువు సాకుతో చాట్​ జీపీటీకి అడిక్ట్​ అయ్యే ముప్పు

చాట్​ జీపీటీ ..పేరులోనే విషయమంతా ఉంది. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఈ అడ్వాన్స్​డ్​ సెర్చ్​ చాట్​బోట్ పైనే ఇప్పుడు అంతటా డిస్కషన్​ నడుస్తోంది. ప్రత్యేకించి ఇది స్టూడెంట్స్​పై ఎలాంటి ఎఫెక్ట్స్​ చూపిస్తుంది ? అనే దానిపై తీరొక్క విశ్లేషణలు వెలువడుతున్నాయి.  చాట్​ జీపీటీని హయ్యర్​క్లాసు లు, కాలేజీ స్థాయి విద్యార్థులు దుర్వినియోగం చేసే చాన్స్​ ఉందని.. అసైన్​మెంట్స్​, ప్రాజెక్ట్​ వర్క్స్​, స్టడీ పేపర్స్​ తయారీకి దానిపై డిపెండ్​ అవుతారని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ సర్ఫింగ్​, సోషల్​ మీడియా బ్రౌజింగ్​లో మునిగిపోయిన విద్యార్థి లోకం.. చాట్​ జీపీటీకి కూడా అడిక్ట్​ అయ్యే గండం ఉందని వార్నింగ్​ ఇస్తున్నారు. ​ కామన్​ సెన్స్​ లేకుండా కమాండ్స్​ పై పనిచేసే చాట్​రోబోకు భావితరాలు అడిక్ట్​ అయితే దేశ భవిష్యత్తుకు ముప్పని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
- సెంట్రల్​ డెస్క్​, వెలుగు

చాట్​ జీపీటీ  ప్లాట్​ ఫామ్​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ టెక్నాలజీని వినియోగించి తన యూజర్​ తో చాటింగ్​ చేస్తూ ఆన్సర్స్​ ఇస్తుంది. ఆర్టికల్స్​ రాసివ్వడం, సాఫ్ట్​వేర్స్​కు కోడింగ్​ రాయడం,  కథలు రాయడం, మ్యూజిక్​ లిరిక్స్​ జనరేట్​ చేయడం వంటి పనులన్నీ చకచకా చేస్తుంది. ఇంకా అదనంగా వీటన్నింటిలో మనం ఇచ్చే కమాండ్​ ఆధారంగా మార్పులు కూడా చేస్తుంది. దీని సేవలకు అడిక్ట్​ అయిపోయి బుర్రకు పనిచెప్పకుంటే.. సమాచారం కాపీయింగ్​కు అలవాటుపడితే విద్యార్థుల్లో క్రియేటివిటీ తగ్గిపోతుందని అంటున్నారు. నాణేనికి బొమ్మాబొరుసు ఉన్నట్టుగా చాట్​ జీపీటీకి కూడా రెండు కోణాలు ఉన్నాయని.. దానిలోని పాజిటివ్​ అంశాలను వాడుకొని, నెగెటివ్​ గా ఉన్నవి వదిలేయాలని ఇంకొందరు నిపుణులు సూచిస్తున్నారు. 

మన దేశంతో పాటు పలు దేశాల్లో నిషేధాలు 

అమెరికాలోని న్యూయార్క్ సిటీ విద్యాశాఖ, సియాటెల్​లోని ప్రభుత్వ పాఠశాలలు, ఫ్రాన్స్ లోని అగ్రశ్రేణి యూనివర్సిటీ సైన్సెస్ పోలు ఇప్పటికే  చాట్ జీపీటీని బ్యాన్ చేశాయి. ఇక మనదేశంలో తొలిసారిగా చాట్​ జీపీటీపై బెంగళూరుకు చెందిన ఆర్​వీ యూనివర్సిటీ బ్యాన్​ విధించింది. యూనివర్సిటీ క్యాంపస్​లోని కంప్యూటర్​ ల్యాబ్స్​లో చాట్​ జీపీటీతో పాటు ఇతర ఏఐ బోట్స్​, గిట్​హబ్​ కాపిలాట్​, బ్లాక్​ బాక్స్​ లపైనే నిషేధం విధించారు. కర్నాటకలోని దయానంద సాగర్ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ బీ)  వంటి సంస్థలు చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలపై విద్యార్థులు ఆధారపడకుండా నిరోధించే చర్యలను అన్వేషిస్తున్నాయి. దయానంద సాగర్ వర్సిటీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు అసైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల స్వరూపాన్ని మార్చాలని భావిస్తున్నాయి.  ఐఐఐటీ-బీ తమ విద్యార్థులు చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపీటీని ఉపయోగించడంపై నిర్మాణాత్మక ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 

బెనిఫిట్స్​ ఇవి

ఇంటర్నెట్​ బాగా వినియోగంలోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో మారుమూల ప్రాంతాల  స్టూడెంట్స్​కు చాట్​ జీపీజీ ఒక వరం లాంటిది. రోజూ స్కూల్ టైం ముగిసిన తర్వాత  ట్యూటర్లు అందుబాటులో లేని పల్లెల విద్యార్థులు చాట్​ జీపీటీని ఒక ట్యూటర్​లా వాడుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని అన్ని డౌట్స్​ క్లియర్​ చేసుకోవచ్చు. అయితే పెద్దల పర్యవేక్షణ ఉంటే బెస్ట్​. చాట్​ జీపీటీ తనను వినియోగించే వ్యక్తి ప్రొఫైలింగ్​ ఆధారంగా అతడి ఆలోచనా విధానం, నాలెడ్జ్​ లెవల్, ఎడ్యుకేషన్​ స్టాండర్డ్​ పై అవగాహనకు వస్తుంది. వీటి ఆధారంగానే సమాధానాలిస్తుంది. ఈ స్పెషాలిటీ.. స్టూడెంట్స్​ కు బాగా ఉపయోగపడు తుంది. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా  ఆన్సర్స్​ వస్తాయి. చాట్​ జీపీటీ కెపాసిటీ అద్భుతం. అది ఒక రోబో కావడంతో.. అలసట అనేది ఉండదు. స్టూడెంట్​ అడిగే ప్రశ్నలకు ఒకానొక దశలో టీచర్​ లేదా ట్యూటర్​ విసుక్కుంటారు. కానీ చాట్​ జీపీటీ విసుక్కోకుండా విరామం తీసుకోకుండా ఆన్సర్స్​ ఇస్తూనే ఉంటుంది. 


ఉపాధ్యాయులు దీన్ని వాడుకొని లెస్సన్​ ప్లాన్స్​ ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఫలితంగా వారికి టైం ఆదా అవుతుంది. విద్యార్థులతో ఇంటరాక్ట్​ అయ్యేందుకు టీచర్లకు సమయం మిగులుతుంది.చాట్​ జీపీటీ ఫ్రీ. ట్యూటర్​ ను పెట్టుకుంటే  కొంత పే చేయాల్సి ఉంటుంది. చాట్​ జీపీటీతో ఆ ఖర్చుండదు. భవిష్యత్తులో దాన్ని ప్రీమియన్​ వర్షన్​లోకి మారుస్తారా ? లేదా ? అనే  దానిపై క్లారిటీ లేదు. చాట్​ జీపీటీ చాలా వేగంగా స్పందించి కొన్ని సెకన్లలోనే ఆన్సర్స్​ ఇస్తుంది. అందువల్ల స్టూడెంట్స్​ కు ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. ఫలితంగా సాధ్యమైనన్ని ఎక్కువ టాపిక్స్​ గురించి స్టూడెంట్స్​ తెలుసుకొని నాలెడ్జ్​ పెంచుకునే అవకాశం కలుగుతుంది. 

నష్టాలివి

ఒక్కోసారి చాట్​ జీపీటీ ఒక ప్రశ్నకు మరో సమాధానాన్ని చూపించే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్​ ఏకాగ్రత దారి తప్పే చాన్స్​ ఉంటుంది. చాట్​ జీపీటీ ఇచ్చే అరకొర సమాచారాన్ని చూసి.. స్టూడెంట్స్​ అదే పూర్తి సమాచారమని భావించే చాన్స్​ ఉంటుంది. దీనివల్ల ఇంకా సమగ్రంగా, లోతుగా సబ్జెక్టును నేర్చుకోవడంపై స్టూడెంట్స్​ దృష్టిపెట్టకపోవచ్చు.  చాట్​ జీపీటీలో వచ్చే సమాధానాలపై సందేహం వస్తే ఎలా ఫ్యాక్ట్​ చెక్​ చేసుకోవాలనేది కూడా స్టూడెంట్స్​కు పెద్దగా తెలియదు. అందువల్ల అక్కడ కనిపించిందే నిజమని నమ్మే చాన్స్​ ఉంటుంది. నిజమైన సమాచారం కంటే తప్పుడు సమాచారం 6 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని అంటారు. చాట్​ జీపీటీలో తప్పుడు సమాచారం వస్తే చెక్​ చేసుకునే టూల్స్ కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని టెక్​ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రతిరోజు ఎంతో సమయాన్ని టెక్​ గాడ్జెట్స్​తో వెచ్చిస్తున్న స్టూడెంట్స్​.. చదువు సాకుతో చాట్​ జీపీటీకి కూడా అడిక్ట్​ అయ్యే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు పెరగొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్​ జీపీటీ వల్ల విద్యార్థుల్లో క్రియేటివిటీకి, బ్రెయిన్​ వర్క్​ కు తావు లేకుండా పోవచ్చు. ఇంతకుముందు వరకు బుర్రకు పదును పెట్టి ఆలోచించాక సందేహాలను క్లియర్​ చేసుకునేందుకు ఇంటర్నెట్​ను సెర్చ్​ చేస్తూ వచ్చిన స్టూడెంట్స్​.. ఇకపై చాట్​ జీపీటీ ఏఐ ఆన్సర్స్​ను చూసి అక్కడే ఆగిపోయే చాన్స్​ ఉంటుంది. విద్యార్థులు అసైన్​ మెంట్స్​, ప్రాజెక్ట్​ వర్క్​లు, రీసెర్చ్​ పేపర్స్​ కోసం చాట్​ జీపీటీపై డిపెండ్​ అయ్యే అవకాశాలు ఉంటాయి, తాము చేసిన ప్రాజెక్ట్​ వర్క్​ల సమాచారాన్ని స్టూడెంట్స్​చాట్​ జీపీటీలో వేసి .. అందులోని మిస్టేక్స్​ గుర్తించమని కమాండ్​ ఇవ్వొచ్చు. వెంటనే అది తప్పులను హైలైట్​ చేసి చూపిస్తుంది. ఇలా చాట్​ జీపీటీతో తప్పులు దిద్దించుకోవడం వల్ల విద్యార్థులకు లాభం ఉండదు. టీచర్​ తప్పులు కరెక్ట్​ చేసి వివరిస్తే అది ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది.