మందు దొంగలు : వరసగా వైన్ షాపులను టార్గెట్ చేసిన దొంగలు

చడ్డీ గ్యాంగ్స్ చూశాం.. చైన్ స్నాచర్స్ అని విన్నాం.. అంతర్ రాష్ట్ర ముఠా అని చెప్పుకున్నాం.. ఇళ్లల్లో దొంగతనాలు విన్నాం.. చూస్తున్నాం.. తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మందు.. అదేనండీ లిక్కర్ దొంగలు తయారయ్యారు. వరుసగా వైన్ షాపుల్లో మందు ఎత్తుకెళుతున్నారు.వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్ జిల్లాలో మందు దొంగలు హల్ చల్ చేశారు. ఇళ్లందకుంటలో చోరీగాళ్లు వైన్స్ షాపుల మీద పడి మందు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అర్థరాత్రి వైన్స్ షాపులోకి వచ్చిన దొంగ..విలువైన మద్యం బాటిళ్లను మాత్రమే తీసుకెళ్లడం గమనార్హం. వైన్స్లో మద్యం చోరీ విజువల్స్ సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. 

Also Read :- లోన్ యాప్ వేధింపులకు సింగరేణి కార్మికుడు బలి

సీసీ టీవీ విజువల్స్ ప్రకారం..ఓ దొంగ అర్థరాత్రి వైన్స్ షాపులోకి వస్తాడు. అటు ఇటు చూసుుకుంటూ..నెమ్మదిగా క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్తాడు. క్యాష్ కౌంటర్ లోని నగదును తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. అనంతరం కొన్ని సెలక్టెడ్ బ్రాండ్ లిక్కర్ బాటిళ్లను తీసుకుని పరారవుతాడు. ఇళ్లందకుంటలో ఒకే రోజు రెండు వైన్స్ షాపులను లూటీ చేశాడు దొంగ. 

పొద్దున వైన్స్ షాపు యజమాని వచ్చేసరికి క్యాష్ కౌంటర్ లో నగదు, కొన్ని విలువైన మద్యం బాటిళ్లు మిస్ అవడం గమనించాడు. ఏమైందోనని సీసీ టీవీల్లో చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ టీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.