యువతిని నడిరోడ్డులో వదిలేసి.. పాస్‌పోర్ట్, లగేజీ బ్యాగ్ తో క్యాబ్ డ్రైవర్ ఎస్కేప్..

ఆన్‌లైన్ క్యాబ్, ఆటో, బైక్ వంటి సేవలు మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, కొన్నిసార్లు అవి అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం కావచ్చు. ఇటీవల, ఓ డ్రైవర్ ఓ యువతిని మధ్యలోనే విడిచిపెట్టి, ఆమె సామాను మొత్తం తీసుకుని పారిపోయాడు. దీంతో ఆమె రోడ్డుపై అలాగే నిలిచిపోవాల్సి వచ్చింది. మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జికి చెందిన శ్రేయ వర్మ భారత్‌కు విమానం కోసం లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దొంగిలించిన తన వస్తువులను తిరిగి ఇప్పించాలని ఆమె అభ్యర్థిస్తోంది.

ఆన్ లైన్ లో ట్రిప్ ఓకే చేసిన డ్రైవర్ ఆమెను తీసుకువెళ్లడానికి వచ్చాడు. దీంతో ఆమె తన వస్తువులు, సామానును క్యాబ్ లో పెట్టింది. ఆ తర్వాత తన హెడ్ ఫోన్స్ మర్చిపోయానని లోనికి వెళ్లి తీసుకువచ్చే లోపు ఆ డ్రైవర్.. రైడ్ ను క్యాన్సిల్ చేసి, ఆ వస్తువులతో పాటు అక్కడ్నుండి ఉడాయించాడు. క్యాబ్ లో పెట్టిన తన వస్తువుల్లో ఆమె పాస్ పోర్ట్, వీసా, వర్క్ ఆథరైజేషన్ వంటి కీలకమైన పత్రాలతో పాటు, కొన్ని విలువైన వస్తువులతో నిండిన రెండు సూట్‌కేస్‌లు కూడా వెనుక సీటులో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత ఆ యువతి కస్టమర్ కేర్ ను సంప్రదించినప్పటికీ.. ఆమె వద్ద డ్రైవర్ లైసెన్స్ ప్లేట్, ఇతర వివరాలు ఏవీ లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. కేంబ్రిడ్జ్ పోలీసు ప్రతినిధి ప్రకారం, అవసరమైన సమాచారాన్ని పొందేందుకు ఏజెన్సీ మిడిల్‌సెక్స్ కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయంతో కలిసి పని చేస్తోంది. సమాచారం తెలిసిన వారు ముందుకు రావాలని పోలీసులు అభ్యర్థిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ కావాలనే వస్తువులను దొంగిలించాడా అన్న దానిపైనా వారు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రేయా వర్మ తన లింక్డ్‌ఇన్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ ఘటన భారతదేశంలోని తన కుటుంబాన్ని కలవకుండా చేసిందని.. ముఖ్యంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రిని కలవలేకపోతున్నందుకు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. క్యాబ్ సర్వీస్ కంపెనీ బాధ్యత వహించాలని కోరుతున్నారు.

 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NBC10 Boston (@nbc10boston)