గృహప్రవేశం, బారసాల, పెళ్లి... వేడుక ఏదైనా, ఏ పూజా కార్యక్రమం అయినా మగ పూజారులే ఎక్కువుగా కనిపిస్తుంటారు. అయితే ట్రెండ్ మారింది. మగవాళ్లకు మాత్రమే పరిమితం అనుకొనే పౌరోహిత్యంలో మహిళలు కూడా అడుగుపెడుతున్నారు. అడగుపెట్టడమే కాదు ఏ మాత్రం తడుముకోకుండా మంత్రాలు చదువుతూ శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు, పూజాది కార్యక్రమాలు జరిపిస్తున్నారు కూడా. అందుకు ఈ నలుగురు మహిళలే ఉదాహరణ. . .
నందినీ భౌమిక్, రుమారాయ్, సేమంతి బెనర్జీ, పౌలోమి చక్రవర్తి అనే నలుగురు మహిళా పూజారులు కోల్ కతాలో దుర్గామాత పూజను జరిపించారు. మంత్రాలు చదువుతూ, తాళాలు కొడుతూ పూజ చేశారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి మహిళా పూజారులు పూజ జరిపించారు. 66 పల్లి దుర్గా పూజా కమిటి తరపున దుర్గాపూజ జరిపించే మగ పూజారి చనిపోవడంతో మహిళా పూజారులకు అవకాశం ఇవ్వాలని నిర్వాహకులు భావించారు. అమ్మలు అమ్మవారిని పూజిస్తారు అనే థీమ్ లో భాగంగా ఈ నలుగురి మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. వీరికి హిందూ ఆచారాలు, పూజా విధానాలపై మంచి పట్టు ఉంది. శుభమస్తు ఆర్గనైజేషన్ నడుపుతూ హిందూ పూజల గురించి, దేవుళ్ల గురించి , ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. సంస్కృతం ప్రొఫెసర్ గా పనిచేసిన డ్రామా ఆర్టిస్ట్ నందినీ భౌమిక్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికి వీరు దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.
మహిళలు అయినంత మాత్రాన వారిని ప్రధాన పూజారులుగా ఎక్కడా తీసుకోవద్దని చెప్పలేదు. మహిళలు వాళ్ల పూజకు అవసరమైనవి తెచ్చుకొని పూజ చేస్తారు. కొందరు మహిళలు మట్టితో దేవతా విగ్రహాలను తయారు చేస్తుంటారు. మరి అలాంటప్పుడు మహిళలు పూజారులుగా ఉంటే తప్పేంటి అని అంటున్నారు 66 పల్లి పూజా కమిటి సీనియర్ మెంబర్ ప్రద్యుమ్న ముఖర్జీ.
ALSO READ : అక్టోబర్ 28 శరత్ పౌర్ణమి: ఆరోజు వెన్నెలలో పెట్టిన పాయసం తింటే... ఏం జరుగుతుందో తెలుసా..
దుర్గామాత పూజకు సంబంధించి పూర్తి వివరాల కోసం పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు, హిందూ సాహిత్యం మొదలైన వాటిని చదివానని మహిళా పూజారి నందిని తెలిపారు. పాటలు, శ్లోకాలను వివరిస్తూ అందరికి అర్దమయ్యే విధంగా తాను పూజలు చేయిస్తామని ఆమె చెబుతున్నారు.