కొత్తగూడెంలో ​ నిర్మాణాలు కట్టారు.. వదిలేశారు

కొత్తగూడెంలో ​ నిర్మాణాలు కట్టారు.. వదిలేశారు
  • కొత్తగూడెంలో వృధాగా మున్సిపల్​ నిర్మాణాలు
  • కమిషన్ల కక్కుర్తితో  ప్లానింగ్​ లేకుండా పనులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సరైన ప్లానింగ్ ​లేకుండా కమిషన్ల మీద ఆశతో  అధికారులు చేపట్టిన పనులు వృధాగా మారాయి. లక్షల్లో ఖర్చు పెట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇలాంటి పనులు అధికారుల అవినీతికి నిదర్శనంగా మిగలగా.. భారీగా  ప్రజాధనం దుర్వినియోగమయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్​ వినిపిస్తోంది.  

ప్రజాధనం వృధా

 బీఆర్​ఎస్​ హయాంలో  కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ సమీపంలో ఫిష్​ మార్కెట్​ నిర్మాణ  పనులు హడావుడిగా మొదలు పెట్టారు.   దాదాపు రూ. 30లక్షలతో  బేస్​మెంట్​, ఫ్లోర్​ వర్క్స్​  చేసి  వదిలేశారు. ఇప్పుడు కొత్తగా  రూ. 4.50 కోట్లతో  కూలీ లైన్​లోని రైతు మార్కెట్​ సమీపంలో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మిస్తున్నారు. దీంతో ఫిష్​ మార్కెట్​ కోసం ఖర్చు చేసిన రూ. 30 లక్షలు బూడిదలో పోసినట్లయ్యింది.   త్రీ టౌన్​ పోలీస్​ స్టేషన్​ వెళ్లే దారిలో దాదాపు రూ. 50 లక్షలతో  నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ కూడా  నిరూపయోగంగా ఉంది.

 సరైన ప్లాన్​ లేకుండా  కాంప్లెక్స్ నిర్మించడంతోపాటు  ఆ ల్యాండ్​కూడా  కేసు కోర్టు ఇరుక్కోవడంతో   అది కూడా నిరుపయోగంగా మారింది.   రైతు మార్కెట్​ వద్ద  స్ట్రీట్ వెండర్స్​ కోసం  దాదాపు రూ. 50లక్షలతో నిర్మించిన మార్కెట్​ సముదాయాన్ని ప్రారంభించి వదిలేశారు.  వీధి వ్యాపారులను ఇక్కడకు  మార్చడంలో మున్సిపల్​ పాలకవర్గం,   ఆఫీసర్లు విఫలమయ్యారు. దీంతో ఆ మార్కెట్  అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా  మారింది.

Also Read :- ఏసీబీకి డబుల్ క్లైమ్ కేసు ఎంక్వైరీ

 దాదాపు రూ. 25లక్షలతో సింగరేణి మెయిన్​ హాస్పిటల్​ సెంటర్​, గవర్నమెంట్​ హాస్పిటల్​, పోస్టాఫీస్​ తదితర చోట్ల  నిర్మించిన సులభ్​ కాంప్లెక్స్​లు వినియోగంలోకి తేలేదు.  సింగరేణి   హాస్పిటల్​దగ్గర  సులభ్​కాంప్లెక్స్​ నిర్మాణాన్ని సగంలోనే వదిలేశారు.  కొత్తగూడెంలో సంత నిర్వహించే ప్రాంతంలో నాన్​ వెజ్​ మార్కెట్​ కోసం దాదాపు రూ. 50లక్షలతో  భవనాలు కొత కాలంగా  వృధాగా ఉండడంతో ఇప్పుడు వాటిని  హోల్​ సేల్​ కూరగాయల వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారు. అయితే వారి నుంచి  మున్సిపాలిటీకి నయా పైసా ఆదాయం లేదు.  

 ​సగంలోనే సింథటిక్​ ట్రాక్

స్థానిక ప్రగతి మైదానంలో రూ. కోటితో  గ్రౌండ్​ డెవలప్​మెంట్​ చేయాలని  ప్లాన్​ చేశారు. దాదాపు రూ. 80లక్షలతో సింథటిక్​ ట్రాక్​ పనులను మొదలు పెట్టి  సగంలోనే వదిలేశారు. ఇప్పుడు ఆ ట్రాక్​ శిథిలమైంది. ఒక్కరోజు ట్రాక్​ను వాడలేదు.   రూ. 50లక్షలతో రెండు లాన్​ టెన్నీస్​ కోర్టులు  నిర్మించారు.  ఒక్కటి నిర్మిస్తే పరిపోయేదని కమిషన్ల కోసం  రెండు నిర్మించారన్న విమర్శలున్నాయి.  రూ. కోటితో ఇండోర్​ షటిల్​ కోర్టు నిర్మించాలని భావించగా  డబ్బులు కూడా సాంక్షన్​ అయ్యాయి.

అయినా  ​కోర్టు నిర్మాణం చేపట్టకుండా  ఇతర పనులకు ఆ డబ్బులు మళ్లించారని  పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. 27వ వార్డులో రూ. 80లక్షలతో  నిర్మించిన ఎంపవర్​ మెంట్​ సెంటర్​  ఏడాదిన్నరగా నిరూపయోగంగా ఉంటుంది.  కరెంట్​ సౌకర్యం కల్పించి  వాటర్​ సప్లై, టాయ్​లెట్స్​ నిర్మిస్తే  సెంటర్​ వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.   రాజీవ్​ పార్క్​లో రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన ఫుడ్   కోర్టులు వాడకపోవడంతో   మందు బాబులకు అడ్డాగా మారింది.