ఉమ్మడి పాలమూరు జిల్లాలో .. ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో .. ఘనంగా ఆదివాసీ దినోత్సవం

అమ్రాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అమ్రాబాద్  మండలం మన్ననూర్  ఐటీడీఏలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్  సంతోష్  నాయక్ హాజరయ్యారు. అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం చెంచులు తమ సాంప్రదాయ వేషధారణ, ఆటపాటలతో ఉరేగింపుగా గిరిజన కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆదివాసీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కొమరంభీం, చెంచు లక్ష్మి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమిష్టి జీవన విధానానికి, కల్మషం లేని జీవితాలకు ఆదివాసీలు నిలువెత్తు నిదర్శమని కొనియాడారు. కలెక్టర్​ సంతోష్​ మాట్లాడుతూ విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమన్నారు. చెంచులకు ఆధార్, రేషన్​ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెంచు నేతలు, ఉద్యోగులకు శాలువాలు కప్పి మెమోంటోలు అందజేసి అభినందించారు. ఐటీడీఏ ఇన్​చార్జి పీవో రోహిత్ గోపిడి, డీటీడబ్ల్యూవో ఫిరంగి, ఆర్డీవో మాధవి, జిల్లా చెంచు సేవా సంఘం నాయకులు నాగయ్య, దాసరి శ్రీనివాసులు, రాజేంద్ర ప్రసాద్, పెద్దిరాజు, శంకరయ్య, నిమ్మల శ్రీనివాసులు పాల్గొన్నారు.

చెంచుపెంటల్లో..

చెంచు వేదిక ఆధ్వర్యంలో చెంచు పెంటల్లో సాంప్రదాయ పద్ధతిలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచు వేదిక కన్వీనర్ చిగుర్ల మల్లికార్జున్  మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి అనేక హామీలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కల్పించిన రాజ్యాంగ హక్కులతో పాటు ఉపాధి, విద్య, వైద్యం, అటవీ హక్కులు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

సంస్కృతిని కాపాడుకోవాలి..

ధన్వాడ: ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్  తరాలకు అందించాల్సిన అవసరం ఉందని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  తెలిపారు. మండలంలోని కొండాపూర్  గ్రామంలోని ట్రైబల్  వెల్ఫేర్  స్కూల్, జూనియర్  కాలేజీలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. కొమరం భీం ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. కాలేజీ స్టూడెంట్ల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ట్రైనీ కలెక్టర్  గరీమా, ప్రిన్సిపాల్  రాజారాం, మిషన్  భగీరథ ఈఈ వెంకటరెడ్డి, ఎంపీడీవో సాయి ప్రకాశ్, తహసీల్దార్ సింధుజ పాల్గొన్నారు.

ప్రాధాన్యత ఇస్తున్నాం..

ఆమనగల్లు: ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కడ్తాల్  మండల కేంద్రంలోని గిరిజన బాలుర హాస్టల్​లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసి దినోత్సవంలో పాల్గొన్నారు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు 
ఆకట్టుకున్నాయి. 

హక్కుల సాధనకు పోరాడుతాం

అచ్చంపేట: రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీల హక్కుల సాధనకు గిరిజన ఉద్యోగ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిచ్యా నాయక్  తెలిపారు. పట్టణంలోని గిరిజన భవనంలో గిరిజన సేవా సంఘం, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్  మహరాజ్, కొమరం భీం ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.