షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 లైట్ త్వరలో భారత మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ అన్ లాక్ ప్రారంభమవుతున్న నేపధ్యంలో వీలైనంత తొందర్లోనే విడుదల చేయడానికి షియోమి సన్నాహాలు రంగం సిద్ధం చేసింది. ఇటీవల ప్రపంచ మార్కెట్‌లో 4జీ మరియు 5జీ వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్‌కు మంచి ఆదరణ లభించడంతో మన దేశంలో కూడా ఇక్కడి విభిన్న వర్గాలకు అనుగుణమైన ఫీచర్లతో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు టెక్ వర్గాల సమాచారం. ఇప్పటికే మన దేశంలో ఎంఐ11 సిరీస్ మొబైల్స్ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐ11 లైట్‌ను భారత్ లో లైట్ అండ్ లోడెడ్ అనే ట్యాగ్ లైన్ తో ప్రస్తుతానికి 4జీ వెర్షన్‌గా విడుదల చేయనున్నట్లు టెలీగ్రామ్ ఛానల్‌లో సమాచారం లీక్ అయింది. 4జీ స్పందన చూసి 5జీని అప్డేట్ వర్షన్ తో తీసుకొస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఊరించే ఫీచర్లు
ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు చూస్తే... 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమోలెడ్ స్క్రీన్. రిఫ్రెష్ రేట్ 90 హెర్జ్‌గా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఐపీ 53 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కోమ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఇస్తున్నారు. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ, కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా 8 ఎంపీతో, మాక్రో కెమెరా 5ఎంపీతో ఉంటాయి. సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరి: 4,250 ఎంఏహెచ్, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ధర తదితర విషయాలు మార్కెట్లో రిలీజ్ కు ముందు ప్రకటిస్తారని సమాచారం.