యాదగిరిగుట్ట, వెలుగు: మహా కుంభ సంప్రోక్షణ ద్వారా ఈ నెల 28న యాదాద్రి టెంపుల్ రీ ఓపెన్ చేయనుండగా, దీనికి సంబంధించిన ముహూర్త పత్రాలకు శుక్రవారం పూజలు చేశారు. మార్చి 21 నుంచి 28 వరకు కొండ కింద 1,008 కుండలాలతో మహా సుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది వాయిదా పడింది. అయితే బాలాలయంలో అంతరంగికంగా జరపాలని చినజీయర్ సూచించగా, కేవలం ఐదు కుండలాలతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి చినజీయర్ పెట్టిన ముహూర్త పత్రాలనే శుక్రవారం స్వామివారి పాదాల చెంత పెట్టి పూజలు జరిపారు.
బంగారు తాపడానికి 15.68 కోట్ల విరాళాలు
లక్ష్మీనరసింహస్వామి విమాన రాజగోపుర బంగారు తాపడం కోసం సెప్టెంబర్ 25 నుంచి మార్చి 3 వరకు రూ.15 కోట్ల 68 లక్షల 67,821 నగరు, 4 కిలోల 618 గ్రాముల బంగారం విరాళంగా వచ్చినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.
ఆన్లైన్ టికెట్లకు ట్రయల్ రన్
ఆలయ పునఃప్రారంభం తర్వాత ఆన్ లైన్ టికె టింగ్ వ్యవస్థను తీసుకురావడానికి ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. www.yadagirigutta.com వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లు, ఇతర సేవల టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
బ్రహ్మోత్సవాలు షురూ
యాదాద్రి టెంపుల్లో శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలాలయంలో వివిధ రకాల పూజలు నిర్వహించారు. 14న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 10న స్వామివారి ఎదుర్కోలు, 11న తిరుకల్యాణం, 12న దివ్యవిమాన రథోత్సవం ఘట్టాలు జరగనున్నాయి. శుక్రవారం పోచంపల్లికి చెందిన పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.