
- రూ.2.77 కోట్ల నష్టం
- 160 ఎకరాల్లో మామిడి
- 90 ఎకరాల్లో వరి
- 140 మంది రైతులకు నష్టం
- మామిడిలో లీజుదారులకే లాస్
యాదాద్రి, వెలుగు : వడగండ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంట లెక్క తేలింది. మూడు మండలాల్లో అకాల వర్షం కురిసినా.. రెండు మండలాల్లోనే నష్టం జరిగిందని ఆఫీసర్లు తేల్చారు. ఆరుగాలం శ్రమించిన వరి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి - 250 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో -రూ.2.77 కోట్ల నష్టం జరిగిపట్లు అధికారులు అంచనా వేశారు.
160 ఎకరాల్లో మామిడి..
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలంలోని 160 ఎకరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు వీయడంతోపాటు వడగండ్లు కురవడం వల్ల మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. చెట్టుమీద నుంచి పడిన కాయలకు దెబ్బలు తగలడం వల్ల తినడానికి, పచ్చళ్లు పెట్టడానికి ఎవరూ ఉపయోగించరు. ఎకరానికి రెండు టన్నుల దిగుబడి లెక్కేసుకున్నా 320 టన్నులు నష్టపోయామని రైతులు చెబుతున్నారు.
90 ఎకరాల్లో వరి..
యాసంగి సీజన్ వరి కోతల సమయంలో ఈనెల 3న అకాల వాన కురిసింది. జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో వడగండ్ల వాన కురువడం వల్ల రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లింది. భూదాన్‌పోచంపల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వాన పడడంతో పెద్దగా నష్టం జరగలేదు. మొత్తంగా 230 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఇందులో తుర్కపల్లి మండలంలోనే 70 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. బొమ్మలరామారం మండలంలో మరో 20 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్ ఆఫీసర్లు తేల్చారు.
రూ.2.77 కోట్ల నష్టం..
కోతకు వచ్చిన వరి పంట దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కాగా ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున 90 ఎకరాల్లో 2,250 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 చొప్పున రైతులకు రూ.53 లక్షల నష్టం వాటిల్లినట్టయింది. 160 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్కో ఎకరంలోని 70 చెట్లకు దాదాపు రెండు టన్నుల మామిడి దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.
ఎకరానికి రెండు టన్నుల దిగుబడి చొప్పున 320 టన్నుల మామిడి కాయలు దెబ్బతిన్నాయి. అయితే టన్నుకు రూ.70 వేల చొప్పున రూ.2.24 కోట్ల నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 140 మంది రైతులకు చెందిన పంట నష్టపోయినట్టు ఆఫీసర్లు జాబితా రూపొందించారు. పంట నష్టపోయిన వీరి బ్యాంకు అకౌంట్లను కూడా సేకరించారు. జరిగిన పంట నష్టంపై అగ్రికల్చర్ఆఫీసర్లు హయ్యర్ ఆఫీసర్లకు రిపోర్ట్పంపించారు.
మామిడి తోట లీజుకు తీసుకున్న వారికే నష్టం..
మామిడి కాయలు రాలిపోవడం వల్ల ఆ తోటలను లీజుకు తీసుకున్న వారే నష్టపోనున్నారు. ఏటా జనవరిలో మామిడి తోటలను పరిశీలించి, దిగుబడి అంచనాలతో లీజుకు తీసుకుంటారు. ఎకరానికి రూ.లక్ష వరకు లీజుకు మాట్లాడుకొని అడ్వాన్స్ చెల్లిస్తారు. ఆ తర్వాత మామిడి రైతులకు ఫుల్ పేమెంట్ చేసి కాయలను కోసి అమ్మేసుకుంటారు. అయితే ఒప్పందాలు జరిగిన తర్వాత వడగండ్ల వాన పడడం వల్ల తోటలను లీజుకు తీసుకున్న వారే నష్టపోతున్నారు. -