
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తీపి, చేదుల కలయికగా ఉంటుందని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆస్థాన సిద్ధాంతి సత్యనారాయణశర్మ తెలిపారు. ఉష్ణోగ్రత తీవ్రతతోపాటు వడగండ్లూ కురుస్తాయని చెప్పుకొచ్చారు. ఈసారి వానలు కూడా అదే స్థాయిలో కురుస్తాయని వెల్లడించారు. అయితే భూకంపాలు, విపత్తులు కలిగే ప్రమాదముందని వివరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ఆలయం వద్ద నిర్వహించిన పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని చెప్పిన ఆయన వడగండ్లతో కూడిన వానలు కురుస్తాయని వివరించారు.
ఈసారి వానలు బాగా కురుస్తాయని, చెరువులు నీటితో కళకళలాడుతాయని, నదులు ప్రవహిస్తాయని వెల్లడించారు. తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆహార ధాన్యాల రేట్లు పెరిగిపోతాయని, ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అనంతరం రాశుల వారీగా ఆదాయం, -వ్యయం, రాజపూజ్యం-, అవమానం గురించి వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహామూర్తి పాల్గొన్నారు.
ఘనంగా ఉగాది.. పంచాంగ శ్రావణాలు..
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. తమ ఇంటి దేవతలకు తీపి.. చేదు కలయికగా బెల్లం, వేపపువ్వు, మామిడితో కూడిన పచ్చడి, పప్పుతో కూడిన భక్ష్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయాలకు వెళ్లి ఉత్సవమూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణుల పంచాంగ శ్రావణం విని, రాశులవారీగా ఆదాయ,- వ్యయాలు, రాజపూజ్యం,-అవమానం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.