యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ కు ఝలక్

  • కాంగ్రెస్ లోకి కాటబత్తిని ఆంజనేయులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు గురువారం కాంగ్రెస్ లో చేరారు. రెండేళ్ల పాటు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన కాటబత్తిని ఆంజనేయులు, 2019లో జరిగిన యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య స్వప్నను కౌన్సిలర్ గా రంగంలోకి దింపారు. కానీ ఆ ఎన్నికలలో ఆయన భార్య ఓటమి చెందారు. అనంతరం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కాటబత్తిని.. ప్రస్తుతం యాదగిరిగుట్ట పీఏసీఎస్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

కాగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన భార్య ఓటమి వెనుక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతుల హస్తం ఉందని, రెబల్ క్యాండిడేట్ ను పోటీలో పెట్టి తన భార్య ఓటమికి కారణమయ్యారని భావించిన కాటబత్తిని.. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాటబత్తిని ఆంజనేయులును బీర్ల అయిలయ్య గురువారం తన ఇంటికి ఆహ్వానించి భవిష్యత్తులో పార్టీలో దక్కే పదవులు,

ప్రాముఖ్యతపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఆంజనేయులుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఐదారు రోజుల్లో తన అనుచరులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరబోతున్నట్లు ఆంజనేయులు ప్రకటించారు.