
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో ఎమ్మెల్యే జోగు రామన్నను నిలదీసిన యాదవ సంఘం
- మెదక్ జిల్లా శివ్వాయిపల్లిలో పద్మా దేవేందర్‌రెడ్డిపై మహిళల ఫైర్
- పథకాలు అందలేదని ఆగ్రహం
జైనథ్, వెలుగు: డీడీలు తీసుకొని ఏడాదిగా ఎదురుచూస్తున్నా గొర్లను పంపిణీ చేయలేదని ఎమ్మెల్యే జోగు రామన్నపై యాదవ సంఘం సభ్యులు మండిపడ్డారు. ఆయన నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్ మండల కేంద్రంలో ప్రచారానికి వచ్చారు. అక్కడ ర్యాలీ నిర్వహిస్తుండగా యాదవ సంఘం సభ్యులు అడ్డుకున్నారు. గొర్ల కోసం 14 నెలల క్రితం 46 మందిమి కలిసి రూ.43,750 డీడీలు కట్టామని, కానీ, 17 మందికి అసలు గొర్రెలే పంపిణీ చేయలేదన్నారు. పైసలు లేకపోయినా అప్పులు తెచ్చి డీడీలు కట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారందరికీ గొర్రెల పంపిణీ జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.
పోడు భూములకు పట్టా, పాస్‌బుక్‌లు ఇవ్వలే..
నిజాంపేట: మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి నిరసన సెగలు తప్పడం లేదు. సోమవారం రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం, శివ్వాయిపల్లి, సుతార్‌పల్లి, అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో శివ్వాయిపల్లి మహిళలు తమకు ప్రభుత్వ పథకాలు అందలేదని, నాణ్యత లేని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, నాలుగైదు సార్లు ఇంటికి వచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టా పాస్ బుక్ లు రాలేదన్నారు. దీంతో పంటను ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కరించి పట్టా పాస్ బుక్ లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.